వైసీపీలో కాక‌.. జ‌గ‌న్ ఏం చేస్తారు.. వాట్ నెక్ట్స్‌?!

Update: 2022-03-06 16:30 GMT
ఏపీలో కొత్త‌గా ఏర్పాటు వైసీపీలో ర‌భ‌సకు కార‌ణంగా మారింది.  నిజానికి కొత్త జిల్లాల ఏర్పాటు విష‌యంలో రాజ‌కీయంగానే కాకుండా.. ప్ర‌జ‌ల ఇష్టానికి అనుగుణంగా నిర్ణ‌యం తీసుకున్నామ‌ని.. ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. అయితే.. అదే నిజ‌మైతే.. జిల్లాల పేర్ల నిర్ణ‌యం వెనుక‌.. ఎందుకు ర‌గ‌డ చోటు చేసుకుంద‌నేది ప్ర‌శ్న‌.

రాజ‌ధాని ప్రాంతంగా పేర్కొనే గుంటూరు జిల్లాను మూడు జిల్లాలుగా విభ‌జించారు. గుంటూరు జిల్లాలోని తాడికొండ, గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజ‌క‌వ‌ర్గాలు, పొన్నూరు, ప్రత్తిపాడు, మంగళగిరి, తెనాలి నియోజ‌క‌వ‌ర్గాల‌తో గుంటూరు కేంద్రంగా గుంటూరు జిల్లా ఏర్పాటు చేశారు.

దీనిపై ఎలాంటి అభ్యంత‌రం లేదు. ఎందుకంటే.. ఇప్పుడు ఉన్న పేరే కాబ‌ట్టి. అయితే, గుంటూరు, ప్ర‌కాశం జిల్లాల్లోని వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌లుపుతూ..  బాప‌ట్ల కేంద్రంగా బాపట్ల జిల్లాను ఏర్పాటు చేస్తారు. దీనిపై అధికార పార్టీకి అభ్యంత‌రం లేదు. కేవ‌లం ప్ర‌తిప‌క్ష టీడీపీ మాత్రం అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తోంది.

అయితే.. గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌లుపుతూ.. న‌ర‌స‌రావుపేట కేంద్రంగా ప‌ల్నాడు జిల్లాను ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ జిల్లాపైనే ఇప్పుడు అధికారపార్టీలోనూ అభ్యంత‌రాలు వ‌స్తున్నాయి.

నర్సరావుపేట పార్లమెంటరీ ప్రతిపాదిత కొత్త జిల్లాకు జాషువా పల్నాడు జిల్లా లేదా పల్నాడు జాషువా జిల్లా అని పెట్టాలని వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి డిమాండ్ చేస్తున్నారు. ఈ మేర‌కు సీఎం జగన్ ను కోరారు న‌ర‌స‌రావు పేట నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసే జిల్లాకు మ‌హాక‌వి గుర్రం జాషువా పేరు పెట్టాల‌నే డిమాండ్ ఉంద‌నేది ఆయ‌న ప్ర‌క‌ట‌న.

మహాకవి గుర్రం జాషువా తెలుగు సాహిత్య చరిత్రలో ఒక అధ్యాయం సృష్టించార‌ని, పల్నాడు పరిధిలోని వినుకొండకు చెందిన గుర్రం జాషువా చిర‌స్మ‌ర‌ణీయంగా రాష్ట్ర చ‌రిత్ర‌లో నిలిచిపోవాలంటే.. ఆయ‌న పేరును జిల్లాకు పెట్టాల‌ని వైసీపీ నాయ‌కులు ప‌లువురు కూడా రోడ్డెక్కారు. అయితే.. రాజంపేట‌కు వ‌చ్చిన ఫోక‌స్ దీనిపై రాలేదు.  

ఇదిలావుంటే, అటు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురంలోనూ జిల్లాల గోల నేత‌ల మ‌ధ్య వివాదాల‌కు దారితీసింది. వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు.. ఏకంగా.. చెప్పుతో కొట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. దీనికి కార‌ణం.. కొత్త‌గా ఏర్పాటు చేస్తున్న భీమ‌వ‌రం జిల్లాకు న‌ర‌సాపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాల‌నేది ఇక్క‌డి డిమాండ్‌.

దీనికితోడు.. ఆయ‌న వ్య‌క్తిగ‌త రాజ‌కీయాలు కూడా క‌లిపేసి.. బ‌హిరంగంగానే చెప్పుతో కొట్టుకున్నారు. మ‌రోవైపు.. నెల్లూరులో ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి కూడా ఇంత కాక‌పోయినా.. ఆయ‌న త‌ర‌హాలో ఆయ‌న కూడా స‌ర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. వెర‌సి.. జిల్లాల ఎఫెక్ట్ బాగానే ప‌నిచేస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఏం చేస్తార‌నేది కీల‌కంగా మారింది.
Tags:    

Similar News