ఈ విషయంలో పవన్ కు కమ్యూనిస్టుల నో సపోర్ట్!

Update: 2019-11-18 14:30 GMT
కమ్యూనిస్టు పార్టీలతో పవన్ కల్యాణ్ అనుబంధం గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆ పార్టీలతో పొత్తుతో ఇటీవలి ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగింది కూడా.  సీట్ల ఒప్పందం ఏదో చేసుకుని పోటీ చేశారు. అయితే ఆ పొత్తు ఇరు పక్షాలకూ పనికి రాలేదు. పవన్ కల్యాణ్ వల్ల కమ్యూనిస్టులకు ఓట్లు పడలేదు, కమ్యూనిస్టుల ఓట్లు  జనసేనకూ పడలేదు! జాయింటుగా పరువు పోగొట్టుకున్నారు.

అయితే అడపాదడపా పవన్ కల్యాణ్, కమ్యూనిస్టు నేతలు కలిసి కనిపిస్తూనే ఉన్నారు. తన దీక్షలను సొంతంగా చేపట్టే పరిస్థితుల్లో లేరు పవన్ కల్యాణ్. తను సొంతంగా ఏమీ చేయలేనని ఫిక్సయినట్టుగా ఉన్నాడు ఈ హీరో. అందుకే ఇతర పార్టీల సహకారం కూడా అడుగుతూ ఉంటారు. ఇసుక దీక్షకు కూడా కమ్యూనిస్టుల సహకారం కోరారు. వారు ప్రకటించారు!

అక్కడి వరకూ బాగానే ఉంది కానీ, ఇప్పుడు ఒక మ్యాటర్ లో పవన్ కల్యాణ్- కమ్యూనిస్టులు ఏకాభిప్రాయంతో లేరు. అది ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంల విషయంలో. గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశ పెడుతూ ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్  విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పవన్ తీవ్రంగా స్పందించడం జరిగింది.

దానికి జగన్ ప్రభుత్వం వైపు నుంచి కూడా ఘాటు సమాధానాలు వచ్చాయి. ఆ అంశంపై ఇంకా  చర్చ సాగుతూ ఉంది.దీనిపై కమ్యూనిస్టు నేత మధు స్పందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులను ఆయన సమర్థించారు.

ఈ విషయంలో ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లిష్ చదువులను మతపరంగా చూడటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇలా తమ పార్టీ విధానాన్ని ఆయన ప్రకటించినట్టుగా అయ్యింది. మరి ఇంగ్లిష్ మీడియం కు వ్యతిరేకంగా పోరాడుతున్న పవన్ కు కమ్యూనిస్టుల మద్దతు కూడా లేనట్టేనేమో!

Tags:    

Similar News