దేశాన్ని పీడిస్తున్న సమస్యలపై కొత్త సర్వే...

Update: 2016-08-27 04:00 GMT
భారతదేశం ఎప్పటికీ అభివృద్ధి చేందుతున్న దేశంగానే మిగిలిపోతుందా లేక అభివృద్ధి చెందిన దేశంగా కూడా నిలుస్తుందా? ఎంతోమంది మేధావులకు - సామాన్యులకు కూడా సమాధానం దొరకని ప్రశ్నగానే ఇది మిగిలిపోతుంది. రాజకీయ నాయకులు చేసే ఎన్నికల వాగ్ధానాలు సగటు భారతీయుడిని ఇంకా బద్దకస్తుడిగా చేస్తున్నాయనే విమర్శలు ఒకవైపు వస్తుంటే.. కులం - మతం పేరుచెప్పి గొర్రెల మందలుగా తయారుచేస్తున్నారనే మరో విమర్శ కూడా ఉంది. ఈ విమర్శల్లో ఉన్న నిజా నిజాలు అందరికీ తెలిసినవే. అయితే దేశానికి ఉన్న సమస్యలపై తాజాగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఒక సర్వే చేసింది. ఆ సర్వేలో దేశానికి గల సమస్యల్లో చాలామంది గుర్తించనిది ఒకటి చేరింది.

ఇప్పటివరకూ భారతదేశానికి జనాభా - అవినీతి - లంచగొండితనం - పేదరికం ఇవే సమస్యలు అనుకున్న - అనుకుంటున్నవారికి తాజాగా డబ్ల్యుఈఎఫ్ (వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌)కి చెందిన గ్లోబల్‌ షేపర్స్‌ వార్షిక సర్వే - 2016 విడుదల చేసిన ఒక నివేదిక కొత్త విషయాన్ని తెలియచేస్తుంది. ఈ సర్వే ప్రకారం దేశాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యల్లో మత ఘర్షణలు కూడా ఉన్నాయట! అయితే ఈ సర్వే ప్రకారం దేశంలోని లక్షలాది ప్రజలు ఏకంగా మత ఘర్షణలే "ప్రధాన సమస్య"గా పేర్కొంటున్నారు. వీటి కారణంగానే దేశ ఔన్నత్యం దెబ్బతినడంతోపాటు - భారతదేశానికే ప్రత్యేకమైనటువంటి సర్వమత సమానత్వం దారిమళ్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతాలతో సంబందం లేకుండా లక్షల మంది ప్రజలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే క్రమంలో భారతదేశంలో పేదరికం కూడా ఒక ప్రధాన సమస్యేనని నూటికి 40 మంది పేర్కొనడం గమనార్హం. పలు అంశాలపై ఈ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సంస్ధ 181 దేశాల్లో సుమారు 26,000 మంది అభిప్రాయాన్ని సేకరించింది. దేశాల పరిధిలో ఉన్న సమస్యలతో సహా విశ్వ వ్యాప్తంగా ఉన్న సమస్యలపైనా ఈ సర్వే సాగింది. మన దేశానికి వచ్చే సరికి మాత్రం లంచగొండితనం - అవినీతి - పేదరికం సహా మతఘర్షణలపె ప్రధానంగా ఈ సర్వే సాగింది. ఏది ఏమైనా.. మతం పేరుచెప్పి ఘర్షణలకు దిగేవారికి.. వారు చేస్తున్నపని దేశ అభివృద్ధికి కంటికి కనిపించని పెద్ద ఆటంకం అని అర్ధమయితే చాలు.
Tags:    

Similar News