అయ్యయ్యో ఎంత పని చేశారు కేసీఆర్.. మీరు మాట తప్పటమా?

Update: 2020-12-09 06:30 GMT
గ్రేటర్ ఎన్నికల వేళ.. వరద పరిహారాన్ని నిలిపివేయటం తెలిసిందే. బీజేపీ.. కాంగ్రెస్ బద్మాష్ గాళ్ల వల్లే.. ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని.. అందుకే.. ఎన్నికల ఫలితాలు వచ్చీ రాగానే తాము వరదసాయాన్ని అందిస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుకొని టీఆర్ఎస్ నేతలు పలువురు చెప్పటం తెలిసిందే. కేసీఆర్ మాట అంటే మాటే. ఒకసారి నోటి నుంచి మాట వచ్చినంతనే.. పరిహారాన్నిఅందించేకార్యక్రమాన్ని చేపడతామన్న ఆయన.. అవసరమైతే మరో రెండు.. మూడు వందల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.

ఈ నెల నాలుగున ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అయితే..ఐదారు తేదీల్లో కాకున్న.. ఏడు అంటే సోమవారం నుంచి పరిహారాన్ని అందించే ప్రోగ్రాం మొదలవుతుందని భావించారు. అందుకు తగ్గట్లే.. సోమవారం ఉదయమే  హైదరాబాద్ మహానగరంలోని చాలా మీ సేవా సెంటర్ల ముందు పరిహారం కోసం జనం బారులు తీరారు. అయితే.. మీ సేవా సెంటర్ల ద్వారా కాకుండా.. అధికారులు ఇళ్లకే వచ్చి మదింపు చేసి పరిహారాన్నిఅందిస్తారంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ స్పష్టం చేశారు.

బాధితుల్ని గుర్తించేందుకు ప్రత్యేక టీంలు వరద ప్రాంతాల్లో పర్యటిస్తాయని చెప్పారు. కానీ.. రోజులు గడుస్తున్నా అధికారులు వస్తున్నది లేదు.. పరిహారాన్ని ఇచ్చింది లేదు. దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. వరద సాయం పంపిణీకి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టత రావాలంటూ కొత్త విషయాల్ని వెల్లడించారు కమిషనర్. ఏ ప్రాతిపదికన రూ.10వేల సాయం ఇవ్వాలన్న దానిపై మార్గదర్శకాలు వస్తాయని.. అవి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలన ఉంటుందన్న లోకేశ్.. గతంలో మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన పెండింగ్ అప్లికేషన్ల పరిశీలన రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో జరుగుతుందని పేర్కొనటం గమనార్హం.

ముంపునకు గురైన 4.3 లక్షల కుటుంబాలకు రూ.430 కోట్లు జీహెచ్ఎంసీ ద్వారా వరద సాయాన్ని ప్రత్యక్షంగా పంపిణీ చేశామన్న ఆయన.. తర్వాత మీ సేవా కేంద్రాల ద్వారా బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం వరద సాయంతో తమకు సంబంధం లేదని.. ఉన్నతస్థాయి ఆదేశాల ప్రకారమే సాగుతామని చెప్పిన వైనం చూస్తే.. పదివేల పరిహారం రచ్చ రానున్న రోజుల్లో మరింతగా కొనసాగే వీలు ఉందన్న మాట వినిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పరిహారం మొదలవుతుందన్న సీఎం కేసీఆర్ మాట అమలు కాకపోవటం ఏమిటి? ఆయన నోటి నుంచి హామీ వచ్చిన తర్వాత.. ఇలా కావటం ఏమిటి చెప్మా?
Tags:    

Similar News