కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ .. హైదరాబాద్ కి మరో మణిహారం !

Update: 2021-06-28 08:53 GMT
కమాండ్ కంట్రోల్ సెంటర్ .. హైదరాబాద్‌ లో మరో కలికితురాయి. ఏ సమయంలో అయినా , ఎక్కడైనా  ఏం జరిగినా క్షణాల్లో  పసిగట్టే ఆధునిక సాంకేతిక పరిజ్ణానం, అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌ , బంజారాహిల్స్‌ లో ముస్తాబు అవుతోన్న కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌   త్వరలో అందుబాటులోకి రాబోతుంది. ఈ ఏడాది చివరి నాటికి కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు పక్కా ప్రణాళికలు వేస్తున్నారు. దీని ఏర్పాటుతో ఒక లక్ష 12 వేల 77 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న తెలంగాణలోని ప్రతి అంగుళం ఇక 360 డిగ్రీల కోణంలో పోలీస్‌ రాడార్‌ పరిధిలోకి వస్తుంది. ఈ బిల్డింగ్ అందుబాటులోకి వస్తే .. రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా కూడా క్షణాల్లో కనిపెట్టవచ్చు.

కాగా, ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ నిర్మాణానికి మొదట 350 కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా.  2019లో ఆ మొత్తం 450 కోట్లకు పెరిగింది. గతేడాది చివరలో అపెక్స్‌ కమిటీ సమావేశంలో మరో రూ.200 కోట్ల వరకు అవసరమనే అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. కరోనా లాక్ డౌన్ లేకపోతె ఇప్పటికే ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి వచ్చేది.  ఏడు ఎకరాల్లో 7 లక్షల చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో నాలుగు బ్లాకుల్లో ఏ, బీ, సీ, డీ  కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ టవర్లు నిర్మిస్తున్నారు. టవర్‌-ఏ గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి 84.2 మీటర్ల ఎత్తు ఉండగా టవర్‌-బీ, సీ, డీలు గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి 65.2 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఇందులో ముఖ్యమైంది ఆఫీస్‌ బిల్డింగ్‌ టవర్‌-ఏ. హెలిప్యాడ్‌ తో కలిపి జీ ప్లస్‌ 20 అం తస్తుల్లో టవర్‌-ఏ నిర్మించారు. ఓపెన్‌ ఆఫీస్‌, మీటింగ్‌ రూమ్స్‌, కాన్ఫరెన్స్‌ రూం, క్యాబిన్లు ఉంటాయి. సీఎం, హోంమంత్రి, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ క్యాబిన్లు, మల్టీపర్పస్‌ హాల్‌, హెలీప్యాడ్‌ టవర్‌-ఏలోనే ఉంటాయి. టవర్‌ -బీని జీ ప్లస్‌ 15గా నిర్మించారు. ఇందులో ఓపెన్‌ ఆఫీస్‌, మీటింగ్‌ రూమ్స్‌, కాన్ఫరెన్స్‌ రూం, క్యాబిన్స్‌, డీజీపీ, సీఎస్‌ క్యాబిన్లు, డయల్‌-100 ఉంటాయి. టవర్‌-సీలో ఆడిటోరియం ఉంటాయి. టవర్‌-డీలో మీడియా సమావేశం నిర్వహణతోపాటు క్యాంటీన్‌, శిక్షణా గదులు, మంత్రుల క్యాబిన్లు, వార్‌ రూం ఉంటాయి.

 పోలీసుతో పాటు అగ్నిమాపక, రైల్వే, విమానాశ్రయ భద్రతా విభాగం, మిలటరీ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్‌, విద్యుత్‌, రెవెన్యూ వంటి కొన్ని ముఖ్య విభాగాలు ఇక్కడి నుంచి పని చేసే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. హోంమంత్రి, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయాలు ఈ సెంటర్‌ లోనే కొనసాగుతాయి. ప్రతి సీసీ కెమెరా రికార్డింగ్‌ ట్విన్‌ టవర్స్‌కు అనుసంధానం కావడంతో ప్రతి ఒక్కరి కదలికల్ని అధికారులు ఇక్కడి నుంచి పర్యవేక్షిస్తారు. కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను టెక్నాలజీ ఫ్యూజన్‌ సెంటర్‌గా రూపుదిద్దుతున్నాం. జిల్లాల్లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్లతో ఈ సెంటర్‌ అనుసంధానమై ఉంటుంది. కాబట్టి ఇది నెట్‌వర్క్‌ ఆఫ్‌ కమాండ్‌ సెంటర్స్‌గా మారుతుంది. ప్రభుత్వ సహకారం, ప్రజలు, నాయకుల భాగస్వామ్యంతో రాష్ట్రంలో 8 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం అని డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు.
Tags:    

Similar News