ఆ హాస్య నటుడు ఎన్నికల బరిలో..

Update: 2018-11-15 08:25 GMT
ఒకప్పుడు టాలీవుడ్ టాప్ కమెడియన్లలో వేణు మాధవ్ ఒకడు. అతడి ధాటికి లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం కూడా తట్టుకోలేకపోయాడు ఒక దశలో. రెండు మూడు షిఫ్టుల్లో పని చేస్తూ.. తీరిక లేకుండా సినిమాలు చేస్తూ కొన్నేళ్ల పాటు హవా నడిపించాడు వేణు. కానీ ఒక దశ దాటాక అతడి హవాకు తెరపడింది. నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పుడు పూర్తిగా తెరమరుగైపోయాడు వేణు. ఇప్పుడతడి చూపు రాజకీయాల మీద పడటం విశేషం. తెలుగుదేశం పార్టీకి అనుబంధ సభ్యుడిగా ఉన్న వేణు మాధవ్.. ఆ పార్టీ తరఫున టికెట్ ఆశించి భంగపడ్డట్లున్నాడు. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమవడం విశేషం.

ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న వేణు.. కోదాడ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గురువారం నామినేషన్‌ వేయనున్నట్లు వెల్లడించాడు. ఈ విషయమై ఫోన్ ద్వారా వేణు విలేకరులకు సమాచారం అందించాడు. వేణుమాధవ్‌ స్వస్థలం కోదాడే. అక్కడే చదువుకున్నాడు. తర్వాత హైదరాబాద్ వచ్చాడు. మిమిక్రీ ఆర్టిస్టుగా జీవితాన్ని మొదలుపెట్టాడు. తర్వాత సినిమాల్లోకి వచ్చాడు. ఒకప్పుడు అతను తెలుగుదేశం పార్టీ సభల్లో మిమిక్రీ చేసేవాడు. నందమూరి తారక రామారావును కూడా మెప్పించాడు అప్పట్లో. వేణు మాధవ్ కుటుంబానికి ముందు నుంచి రాజకీయాలతో పరిచయం ఉంది. అతడి మిత్రులు కూడా రాజకీయాల్లో ఉన్నారు. సినిమాల్లో బాగా సంపాదించి.. బోలెడన్ని ఇళ్లు కూడా కొన్ని వేణు మాధవ్.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి తగ్గ ఆర్థిక బలంతోనే బరిలోకి దిగుతున్నాడు. మరి అతడి ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.


Tags:    

Similar News