ఫ్లాయిడ్ హ‌త్య‌తో కోకాకోలా సంచ‌ల‌న నిర్ణ‌యం

Update: 2020-06-27 13:30 GMT
అమెరికాలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న ప్రపంచంపై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లోనే వ‌ర్ణ వివ‌క్ష ఉంటే ఇక అభివృద్ధి చెంద‌ని, చెందుతున్న దేశాల్లో రంగును బ‌ట్టి ఒక వ్య‌క్తిని ద్వేషించ‌డం.. దాడి చేయ‌డం వంటివి దుర్మార్గ‌పు చ‌ర్య‌. దీన్ని వ్య‌తిరేకిస్తూ అమెరికాతో పాటు ప‌లు దేశాల్లో ఉద్య‌మాలు మొద‌ల‌య్యాయి. దీని ప్ర‌భావం చాలా రంగాల‌పై ప‌డింది. ముఖ్యంగా సామాజిక మాధ్య‌మాల‌పై తీవ్రంగా ప‌డింది. ఈ క్ర‌మంలో వాణిజ్య ప్ర‌క‌ట‌న నిషేధం వ‌రుస‌గా చాలా కంపెనీలు విధిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఎఫ్‌ఎమ్‌సిజి కంపెనీలలో ఒకటైన కోకా కోలా కీలక నిర్ణయం తీసుకుంది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై తన ప్రకటనలన్నింటిని నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దాదాపు 30 రోజుల పాటు సోషల్ మీడియాలో ప్రకటనల్ని నిలిపివేస్తున్నట్లు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వర్ణ వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వివ‌రించింది. అయితే అధికారిక బహిష్కరణలో చేరడం లేదని మాత్రం స్ప‌ష్టం చేసింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో జాత్యహంకార విషయాలను ఎలా ఎదుర్కోవాలో కంపెనీ పనిచేయాలని కోరుకుంటుంది. గత కొన్ని రోజులుగా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో జాత్యహంకార ప్రకటనలు వ్యతిరేకిస్తున్నామన్నారు. అందుకే కంపెనీలు తమ ప్రకటనలను నిలిపివేస్తున్నాయని తెలిపారు. ప్రపంచంలో జాత్యహంకారానికి చోటు లేదని, సోషల్ మీడియాలో జాత్యహంకారానికి చోటు లేదని కోకాకోలా కంపెనీ చైర్మన్, సీఈఓ జేమ్స్ క్వినీ క్లుప్త ప్రకటనలో తెలిపారు. సోషల్ మీడియా కంపెనీలు ఇతర ప్రధాన బ్రాండ్లు మార్పుల కోసం బహిష్కరించాయన్నారు. ద్వేషపూరిత విషయాలను ఎదుర్కోవటానికి.. మరింత జవాబుదారీతనం మరియు పారదర్శకతను అవలంబించాలని పేర్కొన్నారు.

ప్రకటనలను ఆపడం అంటే ఆఫ్రికన్ అమెరికన్ పౌర సంఘాల ఉద్యమంలో చేరినట్లు కాదని ఆ సంస్థ వివ‌ర‌ణ ఇచ్చింది. కోకో కోలాతో పాటు లిప్టన్ టీ, బెన్ అండ్ జెర్రీ ఐస్ క్రీమ్‌లతో సహా బ్రాండ్‌లకు నిలయమైన యునిలివర్ 2020 చివరి వరకు అమెరికాలో ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటనలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

మన దేశంలో కూడా ఆ ఉద్య‌మ ప్ర‌భావం మొద‌లైంది. హిందుస్థాన్ యునిలివర్‌ సంస్థ తమ ‘ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ బ్రాండ్ పేరులో ‘ఫెయిర్‌’ అనే మాటను తొలగిస్తున్నట్లు ప్రకటన చేసింది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్ చర్మాన్ని తెల్లబరిచే సౌందర్య సాధనాల విక్రయాన్ని భార‌త‌దేశంలో నిలిపివేస్తున్న‌ట్లు ప్రకటించింది. తాజాగా ప్ర‌ముఖ మ్యాట్రిమోనియ‌ల్ వెబ్‌సైట్ షాదీ.కామ్ క‌ల‌ర్ ఫిల్ట‌ర్‌ను తొలిగించే దిశ‌గా నిర్ణ‌యం తీసుకుంది.

సామాజిక మాధ్యమం లో అగ్రగామిగా ఉన్న ఫేస్ బుక్ కు ఒక్కసారిగా భారీ షాక్ తగిలింది. ఏకంగా రూ.53 వేల కోట్ల నష్టం ఏర్పడింది. నకిలీ వార్తలు, విద్వేషపూరిత పోస్టుల కట్టడికి సరైన చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో పలు కంపెనీలు వాణిజ్య ప్రకటనలు నిలిపివేశాయి. ఫేస్​బుక్​కు ఇస్తున్న యాడ్స్​ను ఒక్కసారిగా నిలిపేశాయి. దీంతో 53 వేల కోట్ల రూపాయల ఫేస్ బుక్​ సంపద ఒక్క రోజులోనే ఆవిరయ్యింది.

ఆ సంస్థ షేర్ విలువ శుక్రవారం దాదాపు 8.3 శాతం పతనమయ్యింది. యూనిలీవర్ తో పాటు వెరిజోన్ కమ్యూనికేషన్స్, హెర్షీస్ తదితర సంస్థలు ఫేస్​బుక్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. ఇకపై ఫేస్ బుక్ సంస్థకు ప్రకటనలు ఇవ్వబోమని సంచలన నిర్ణయం తీసుకున్నాయి. మరో అంతర్జాతీయ సంస్థ కొకాకోలా నెల రోజుల పాటు సోషల్ మీడియా సంస్థలకు ఇస్తున్న ప్రకటనల​ను నిలిపేస్తున్నట్లు పేర్కొంది.

ఈ సందర్భంగా ఫేక్ న్యూస్ పై ఫేస్ బుక్ సంస్థ సీఈఓ మార్క్ జుకర్​బర్గ్ స్పందించారు. అన్ని రకాల ఓటింగ్ సంబంధిత పోస్టులకు కొత్త ఓటరు సమాచారం అనే లింకును జోడిస్తామని తెలిపారు. విద్వేషపూరిత వ్యాఖ్యల పరిధిని సైతం పెంచుతున్నట్లు ఓ ప్రకటనలో చెప్పారు. ఇకపై రాజకీయ నాయకులు కూడా వీటి నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.


Tags:    

Similar News