గరీబ్ దర్శన్ కి 15,000వేలు.. దారుణ జీవితం.. విదేశీయులకు వినోదమా?

ముంబైలోని ధారవిలో ఇప్పుడు ఓ వింత వ్యాపారం జరుగుతోంది. అక్కడ మనుషుల పేదరికాన్ని వ్యాపారంగా మారుస్తున్నారు.;

Update: 2026-03-02 10:35 GMT

ముంబైలోని ధారవిలో ఇప్పుడు ఓ వింత వ్యాపారం జరుగుతోంది. అక్కడ మనుషుల పేదరికాన్ని వ్యాపారంగా మారుస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ప్రపంచంలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటిగా పేరున్న ఇక్కడి సందులను, మురుగు కాలువలను చూడటానికి విదేశీయులు, ధనవంతులు ఏకంగా 15,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. రెండు గంటల పాటు సాగే ఈ 'గరీబ్ దర్శన్' ఇప్పుడు ఒక ఖరీదైన టూరిజం ప్యాకేజీగా మారిపోయింది. కటిక దారిద్య్రాన్ని వినోదంగా చూపిస్తూ డాలర్లు సంపాదించడంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ వివారాలు చూద్దాం..

మురికి కాలువల్లో బంగారం వెతకడం:

కలల నగరం ముంబైలో గాలి కూడా అమ్ముతారనే మాట వినే వుంటాం. కానీ ఇక్కడ పేదరికాన్ని అమ్మడం చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ధారవిలోని ఇరుకైన సందులు, మురికి కాలువలు విదేశీ పర్యాటకులకు ఒక ఎడ్యుకేషన్ లాగా, మన దేశీ ఎలైట్ వర్గానికి ఒక ఎక్స్‌పోజర్ లాగా కనిపిస్తున్నాయి. ఇక కేవలం రెండు గంటల పాటు ఆ మురికివాడల్లో విదేశీయులు తిరగడానికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు వసూలు చేస్తున్నారంటే, అక్కడ పేదరికం ఏ రేంజ్‌లో అమ్ముడుపోతుందో అర్థం చేసుకోవచ్చు. సామాన్యులు అడుగు పెట్టడానికి కూడా జంకే ఆ గల్లీలు, ఇప్పుడు డాలర్లు కురిపించే వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి.

ధారవి మరో ముఖం:

ఒకప్పుడు కొందరు డాన్లకు అడ్డాగా ఉన్న ధారవి, ఇప్పుడు తన రూపు మార్చుకుంది. రక్తపాతం, వసూళ్లకు బదులు ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్, డ్రగ్స్ మరియు ఈ మురికివాడల టూరిజం వంటి వైట్ బిజినెస్‌లు నడుస్తున్నాయి. ఇక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ చెప్పినట్లు, ధారవిలో నేర స్వభావం మారలేదు కానీ చేసే పద్ధతులు మారాయి. పర్యాటకులకు ఇక్కడి కష్టాలు చూపించి డబ్బులు పిండుకునే ఈ 'షాడో ఎకానమీ' వెనుక పెద్ద నెట్‌వర్కే ఉంది. పేదవాడి ఆకలి, అగచాట్లు ఇప్పుడు కొందరికి విలాసవంతమైన వినోదంగా మారిపోయాయి.

మానవత్వం వర్సెస్ వ్యాపారం:

ఇప్పటికే మనం చూసి వుంటాం, కొందరు పేదరికాన్ని ఫోటోలు తీసుకోవడం, వాటిని సోషల్ మీడియాలో పెట్టడం లాంటివి చేస్తుంటారు .ఇది ఇప్పుడు ఒక ఫ్యాషన్‌గా మారింది. విదేశాల నుంచి వచ్చే వారు మన దేశంలోని దారిద్య్రాన్ని చూసి ముక్కున వేలేసుకుంటారు, కానీ ఆ 15 వేల రూపాయల్లో ఎంత మొత్తం అక్కడ నివసించే పేదవారికి ఇస్తున్నారు అనేది ప్రశ్నార్థకమే. ధారవి నివాసితులు కొందరు దీనివల్ల ఉపాధి పొందుతున్నా, వారి బతుకు చిత్రాన్ని ఇలా ప్రదర్శన వస్తువు లాగ మార్చడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. కష్టాల్లో ఉన్న మనుషులను చూసి జాలి పడాల్సింది పోయి, వాటిని టికెట్ కొని చూసే వినోదంగా మార్చడం సమాజం ఎటు వెళ్తుందోనన్న ఆందోళన కలిగిస్తోంది అంటున్నారు నిపుణులు.

Tags:    

Similar News