ఇసుక కోసం ఏపీలో సెల్ టవర్ ఎక్కాడు

Update: 2020-11-26 05:45 GMT
ఒకటి తర్వాత మరొకటి అన్నట్లుగా వరుస పెట్టి చేపడుతున్న సంక్షేమ పథకాలు బాగున్నాయి. అదే సమయంలో కొన్ని అంశాల్లో అధికారులు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం ప్రభుత్వానికి చెడ్డపేరును తీసుకురావటమే కాదు.. ఇరుకున పడేసేలా చేస్తోంది. ఏపీలో ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది. ఇసుక విషయంలో ప్రభుత్వ పాలసీ సరిగానే ఉన్నా.. అధికారుల పుణ్యమా అని కొత్త ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో తమ సమస్యల తీవ్రతను తెలియజేయాలన్న ఉద్దేశంతో కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ఒకరు సెల్ టవర్ ఎక్కారు. రాష్ట్రంలో తీవ్రమైన ఇసుక కొరత నెలకొందన్న ఆయన.. తన ఇంటి నిర్మాణం కోసం రెండు నెలలుగా తిరుగుతున్నా ప్రయోజనం లేకపోయినట్లుగా పేర్కొన్నారు. దీంతో.. తీవ్ర ఆవేదనకు గురైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత.. ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు సెల్ టవర్ ఎక్కిన వైనం స్థానికంగా సంచలనంగా మారింది.

ఇసుక డంపింగ్ యార్డు ఏర్పాటు చేసినా.. సర్వర్ సరిగా పని చేయని కారణంగా ఆన్ లైన్ లో ఇసుక కోసం ఆర్డర్ బుక్ చేసినా నమోదు కావటం లేదంటున్నారు కర్నూలు జిల్లాకు చెందిన పరమేశ్వరరెడ్డి. ఇసుక సమస్య ముఖ్యమంత్రికి తెలియాలని.. ఆయన వరకు వెళ్లేందుకే తానీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లుగా పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు చెప్పినా ఫలితం ఉండటం లేదని.. అందుకే తానీ పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.

 ఇప్పుడున్న పరిస్థితుల్లో పేదవాడు ఇళ్లు కట్టుకోలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నాడు. ఇసుక లభ్యత విషయంలో ఎలాంటి రాజకీయాలు ఉండకూడదన్న ఉద్దేశంతో అధికారులకు అప్పజెప్పిన జగన్ సర్కారు.. తాజాగా నెలకొన్న పరిస్థితులను కళ్లకు కట్టేలా చెప్పే ప్రయత్నం చేసిన వైనంపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News