ఎన్నిసార్లు రంగం సిద్ధం చేస్తావ్ రజినీ?

Update: 2020-09-17 09:10 GMT
రజినీ కాంత్ రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధం.. త్వరలోనే పార్టీ ఆరంభం.. ఇంకొన్ని రోజుల్లోనే క్షేత్ర స్థాయి పర్యటనలు.. ఇలాంటి వార్తలు చదివి చదివి, విని విని విసుగెత్తిపోతున్నారు తమిళ జనం. అసలు తన రాజకీయ అరంగేట్రాన్ని ప్రకటించడానికే ఏళ్లకు ఏళ్లు సమయం తీసుకున్న రజినీ.. చివరికి జయలలిత మరణించి తమిళనాట రాజకీయ శూన్యత ఏర్పడ్డాక కానీ ఈ విషయంలో ప్రకటన చేయడానికి సాహసించలేదు. ఆ తర్వాత అయినా సాధ్యమైనంత త్వరగా పార్టీని ప్రకటించి రంగంలోకి దిగుతాడు అనుకుంటే.. ఎంతకీ ఆ పని చేయట్లేదు. మూడేళ్లుగా ఈ విషయాన్ని నానుస్తూనే ఉన్నాడు. రాజకీయాల ఊసే లేకుండా ఉన్నపుడేమో తాపీగా సినిమాలు చేసిన వాడు.. ఎప్పుడైతే రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించాడో అప్పట్నుంచి సినిమాల్లో యమ బిజీ అయిపోయాడు. వరుసబెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.

గత ఏడాది లోక్‌సభ ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉన్న రజినీ.. తన టార్గెట్ అసెంబ్లీ ఎన్నికలే అన్నాడు. ఐతే వాటికి ఇంకో ఎనిమిది నెలలే ఉంది. కానీ ఇప్పటికీ పార్టీ మొదలే కాలేదు. ఇప్పుడేమో పార్టీ ఆరంభానికి రంగం సిద్ధం అంటూ మీడియాకు లీకులిచ్చాడు. వాళ్లు మళ్లీ అరిగిపోయిన ఆ వార్తల్నే వడ్డిస్తున్నారు. తన అభిమాన సంఘాల నాయకులతో రజినీ వరుసబెట్టి సమావేశాలు నిర్వహిస్తున్నాడట. తాను పోటీ చేయడానికి ఏ నియోజకవర్గాలు బాగుంటాయని పరిశీలిస్తున్నాడట. ఇందుకు నాలుగు నియోజకవర్గాలను ఫైనలైజ్ చేశారట. అలాగే పార్టీ ఆరంభించాక ఏమేం చేయాలి.. అభ్యర్థుల ఎంపిక ఎలా.. పొత్తుల మాటేంటి అనే విషయాలను ఆయన చర్చిస్తున్నారట. ఐతే ఇలా ఎంత కాలం చర్చిస్తూ కూర్చుంటాడు.. ఎప్పుడు పార్టీని మొదలు పెట్టి దాన్ని క్షేత్ర స్థాయి లో విస్తరించే ప్రయత్నం చేస్తాడు.. ఎప్పుడు జనాల్లో తిరుగుతాడు.. ఓటర్లను ఎలా ఆకర్షిస్తాడు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంకా రజినీ కొత్త సినిమా ‘అన్నాత్తె’ షూటింగ్ పూర్తి కాలేదు. ఆ పని పూర్తి చేశాకే ఆయన రాజకీయాలపై దృష్టి పెట్టనున్నాడు. మొత్తంగా చూస్తే ఎన్నికలకు మూణ్నాలుగు నెలల ముందు కానీ రజినీ రంగంలోకి దిగేలా కనిపించడం లేదు.
Tags:    

Similar News