మద్దతు ఓకే.. ఇంతకు మీరేం చేశారు చిరు?

Update: 2016-05-29 04:39 GMT
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ రాజకీయ నేత అయినా తాము చేసిన రాజకీయాలకు సమాధానం చెప్పాల్సిన వైనంపై జాబితా ఒకదాన్ని సిద్ధం చేస్తే అందులో అగ్రస్థానంలో నిలిచే పేరు మాజీ కేంద్రమంత్రి.. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అని చెప్పక తప్పదు. మార్పు తీసుకొస్తానని చెప్పి ప్రజారాజ్యం పార్టీని పెట్టి.. కాంగ్రెస్ లో కలిపేయటమేకాదు.. రాష్ట్ర విభజన లాంటి అంశంపై పలుమార్లు పిల్లిమొగ్గలు వేసిన చిరు.. కేంద్రమంత్రిగా వ్యవహరించిన కాలంలో తెలుగు ప్రజలకు ఏం చేశారన్న విషయాన్ని పక్కన పెడితే.. ఆయన ప్రాతినిధ్యం వహించే కాపులకు ఏం లాభం చేశారన్న ప్రశ్నకు సైతం చిరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

కానీ.. ఏ అంశంపైనా సమాధానం చెప్పని చిరు.. ఇప్పుడు మాత్రం కాపుల రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న ముద్రగడకు తన మద్దతు పూర్తిగా ఉంటుందని హామీ ఇవ్వటం గమనార్హం. ఈ రోజు ముద్రగడకు అండగా నిలుస్తానని చెబుతున్న చిరు.. తాను కీలక నేతగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చక్రం తిప్పినప్పుడు ఏం చేసినట్లు? చివరకు కాపులకు రిజ్వేషన్ ఇచ్చే అంశం మీద కాంగ్రెస్ ఎన్నికల హామీ పత్రంలోనూ ప్రస్తావించని వైనంపై చిరు ఏం సమాధానం చెబుతారు? పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి.. కేంద్రమంత్రి పదవిని చేపట్టిన  చిరు లాంటి నేత.. నాడు కానీ ప్రయత్నించి ఉంటే కాపులను బీసీ జాబితాలో చేర్చటం పెద్ద కష్టమయ్యేదా? అన్న ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది.

కాపుల్ని బీసీల్లో చేర్చటం తర్వాత.. కనీసం ఆ డిమాండ్ మీద చిరు ఏ రోజైనా పోరాడింది ఉందా? అంటే లేదని చెప్పాలి. తన చేతిలో పవర్ ఉన్నప్పుడు ఏమీ చేయని చిరు.. ఈ రోజు కాపుల ఉద్యమం చేస్తానని చెబుతున్న ముద్రగడకు తన మద్దతు అని చెప్పటంలో అర్థం ఉందా? అన్నది కీలక ప్రశ్న. ప్రశ్నలకు సమాధానం చెప్పే అలవాటు లేని చిరు ఇప్పుడు మాత్రం నోరు విప్పుతారని అనుకోవటం అత్యాశే అవుతుందేమో..? కాపుల సంక్షేమం మీద ముద్రగడ లాంటి వారు చేసే ఉద్యమానికి మద్దతు ఇచ్చే చిరంజీవి.. ముందు తాను ఎందుకు ఏమీ చేయలేని విషయంపై వివరణ ఇవ్వాలన్న అభిప్రాయాన్ని పలువురు కాపులు వ్యక్తం చేయటం గమనార్హం.
Tags:    

Similar News