అన్నామలై గుహలో దొరికిన చైనీయుడు.. ఎందుకు ఉన్నట్లు?

Update: 2020-04-18 05:50 GMT
కరోనా వేళ.. దేశం ఏదైనా చైనీయులు కనిపిస్తే చాలు కంగారు పడిపోతున్నారు. ఇలాంటివేళ.. ఒక గుహలో పది రోజులుగా ఒంటరిగా ఉన్న వైనం కలకలం రేగింది. అతడ్ని అదుపులోకి తీసుకున్న ఉదంతంలో తమిళనాడులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరువన్నమలైలో చోటు చేసుకుంది. ఎందుకిలా అన్న విషయంలోకి వెళితే..

చైనా రాజధాని బీజింగ్ కు చెందిన ముప్ఫై ఐదేళ్ల యౌరుయి యాంగ్ కొద్ది రోజుల క్రితం తమిళనాడుకు వచ్చాడు. తిరువన్నమలై ఆలయాన్ని సందర్శించాడు. ఆలయ మహిమల గురించి తెలుసుకున్న అతడు..అక్కడే కొంతకాలం ఉండాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 26న ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటూ అధ్యాత్మికతలో మునిగిపోయాడు.

ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే లెక్క తేడా వచ్చింది. కరోనా మహమ్మారి విరుచుకుపడటం.. చైనీయుల ఇమేజ్ దారుణంగా దెబ్బతింది. కరోనా భయంతో అతను ఉన్న ఇంటిని ఖాళీ చేయాలని యజమాని కోరటంతో అతడేం చేయలేని పరిస్థితి. చైనీయుల మీద ఉన్న అపోహతో ఇల్లు ఖాళీ చేయటంతో హోటళ్లు.. లాడ్జిలు ఇలా ఎన్నింటినో ట్రై చేసినా.. అతడికి ఆశ్రయం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
దీంతో.. టూరిస్టు గైడ్ సూచన మేరకు అన్నామలై కొండ మీద ఉన్న గుహలో ఉండాలని డిసైడ్ అయ్యాడు. అతడు ఒంటరిగా గుహలో ఉన్న విషయం పోలీసులకు కాస్త ఆలస్యంగా సమాచారం అందింది. వెంటనే వెళ్లిన వారు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. గుహలో ఒంటరిగా ఉంటూ నీళ్లు.. బిస్కెట్లతో కాలం గడుపుతున్నాడు. దీంతో ముందస్తు జాగ్రత్తగా అతనికి  కరోనా పరీక్షలు చేశారు. అందరూ అనుమానించినట్లుగా అతడికి కరోనా లేదని తేలింది.

ఏం చేయాలో తోచని వేళ.. గుహలో ఉన్న విషయాన్ని గుర్తించిన అధికారులు అతన్ని క్వారంటైన్ సెంటర్ కు పంపారు. చైనాకు తిరిగి పంపే వరకూ అతడ్ని ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంటుందని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత చైనాకు వెళ్లాలన్న యోచనలో ఉన్నాడు యాంగ్.
Tags:    

Similar News