డ్రాగన్ కు మంట.. మనకి వార్నింగ్

Update: 2016-10-27 10:14 GMT
మొన్నటి వరకూ చైనా వస్తువుల్ని వినియోగించొద్దు.. బ్యాన్ చేయండంటూ వస్తున్న వార్తల్ని లైట్ తీసుకున్న డ్రాగన్ కు.. ఈ ప్రచారం తమను ఎంత దెబ్బేస్తుందన్న విషయం ఇప్పటికి అర్థమైనట్లుగా కనిపిస్తోంది. దాయాది పాక్ తో చెట్టాపట్టాలేసుకునే చైనా వక్రబుద్ధిపై భారతీయులు పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఇందులో భాగంగా చైనీయుల్ని దెబ్బేయటానికి పెద్ద పెద్ద ప్రయత్నాలేమీ అక్కర్లేదు. సింఫుల్ గా.. ఆ దేశానికి చెందిన వస్తువుల్ని కొనకుండా ఉంటే సరిపోతుందన్న వాదనతో బలమైన ప్రచారం సాగుతోంది. సోషల్ మీడియాలో షురూ అయిన ఈ ప్రచారం రోజురోజుకీ పెరుగుతూ.. ప్రజల్లో సైతం చైతన్యం పెరుగుతున్న పరిస్థితి.

అయితే.. ఇలాంటి ప్రచారాన్ని మొన్నటి వరకూ లైట్ గా తీసుకుంది చైనా. ఆ దేశ అధికారిక పత్రిక అయిన గ్లోబల్ టైమ్స్ సైతం.. ఇలాంటివేమీ తమపై ప్రభావం చూపించదన్న వాదనను వినిపించింది. అలాంటి చైనాకు ఉన్నట్లుండి కోపం వచ్చేసింది. భారత్ లో తమ వస్తువుల అమ్మకాల్ని బహిష్కరిస్తే.. రెండు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం పడుతుందని.. ఇరుదేశాల మధ్య పరస్పర పెట్టుబడులను కూడా ఇది దెబ్బ తీస్తుందని పేర్కొనటం గమనార్హం. భారత్ లో పెట్టుబడులు పెట్టాలనుకున్న చైనా కంపెనీలపై వస్తు బహిష్కరణ ప్రభావం పడుతుందని.. ఇది ఇరుదేశాల సంబంధాలపై కూడా ప్రభావం చూపిస్తుందన్న చైనా రాయబారి జీ లియాన్.. ఇలాంటివేమీ రెండు దేశాల ప్రజలు కోరుకోవటం లేదని వ్యాఖ్యానించటం గమనార్హం.

చైనాకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారంలో ఇప్పటివరకూ నేరుగా ప్రభావం పెద్దగా పడనప్పటికీ.. చైనా తయారీ దీపావళి టపాసుల మీద మాత్రం ఈ ప్రభావం కనిపిస్తోంది. అత్యధిక కాలుష్యం వెదజల్లే చైనా క్రాకర్స్ ను కొనొద్దంటూ భారీ ఎత్తున సాగుతున్న ప్రచారానికి తోడు.. ప్రజలు సైతం స్వచ్ఛందంగా చైనా టపాసుల్ని కొనేందుకు ఇష్టపడకపోవటంతో చైనా వ్యాపారాన్ని భారీగా దెబ్బ తీస్తోందని చెబుతున్నారు. ఇదే.. తాజా వార్నింగ్ కు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News