స‌రిహ‌ద్దుల్లో బ్ర‌హ్మోస్‌.. చైనా గ‌డ‌గ‌డ‌!

Update: 2016-08-23 04:46 GMT
భారత్-చైనా స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో కొద్ది రోజులుగా ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కాస్త టెన్ష‌న్ గా ఉన్న ఆ ప్రాంతంలోకి బ్ర‌హ్మోస్ క్షిప‌ణిని తీసుకొచ్చింది మ‌న‌దేశం. దీంతో చైనా లొడ‌లొడ వాగుతోంది! బ్ర‌హ్మోస్ కెపాసిటీ చూసి భ‌య‌ప‌డుతోంది. బ్ర‌హ్మోస్ సూప‌ర్ సానిక్ క్రూయిజ్ క్షిప‌ణిని దాదాపు రూ. 4500 కోట్ల వ్య‌యంతో రూపొందించిన సంగ‌తి తెలిసిందే. ఉప‌రితలం - నౌక‌ - జ‌లాంత‌ర్గామి... ఎక్క‌డి నుంచైనా దీన్ని ప్ర‌యోగించ‌వ‌చ్చు. గంట‌కు 3,400 కి.మీ. వేగంతో దూకెళ్తూ 300 కి.మీ. దూరంలో ఉన్న టార్గెట్  ను నిమిషాల్లో నాశ‌నం చేయ‌గ‌ల శ‌క్తి ఈ క్షిప‌ణి సొంతం. ఇలాంటి క్షిప‌ణి అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ స‌రిహ‌ద్దు ప్రాంతానికి వ‌చ్చేస‌రికి చైనాలో కంగారు మొద‌లైంది. దీంతో చైనా ఆర్మీ అధికార ప‌త్రిక‌లో పిచ్చారాతలు రాసింది. పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ డైలీలో భార‌త్ చ‌ర్య‌ను త‌ప్పుబ‌డుతూ వ్యాఖ్య‌లు చేసింది.

బ్ర‌హ్మోస్‌ ను స‌రిహ‌ద్దు ప్రాంతంలో మోహ‌రించ‌డం ద్వారా  భార‌త్ త‌మ‌కు వ్య‌తిరేక సంకేతాలు ఇస్తున్న‌ట్టుగా భావించాల్సి ఉంటుంద‌ని ఆ ప‌త్రిక‌లో పేర్కొంది. ఈ చ‌ర్య రెండు దేశాల‌కూ మంచిది కాద‌నీ, రెండు దేశాల స‌రిహ‌ద్దుల మ‌ధ్య ఉన్న వాతావ‌ర‌ణాన్ని ఉద్రిక్తం చేసేలా ఉంద‌ని వ్యాఖ్యానించింది. ఈ క్షిప‌ణిని స‌రిహ‌ద్దుకు తీసుకురావ‌డం వ‌ల్ల భార‌త్‌-చైనా దేశాల ద్వైపాక్షిక సంబంధాల‌పై కూడా ప్ర‌భావం ఉంటుంద‌ని స‌ద‌రు ప‌త్రిక అభిప్రాయ‌ప‌డింది.

అయితే, చైనా ఆర్మీ వ్యాఖ్య‌ల్ని ఇండియా కొట్టి పారేసింది. స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌లో భాగంగా - ఒక రొటీన్ ప్రాసెస్ లో బ్ర‌హ్మోస్ ను అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌ కు పంపామ‌ని ర‌క్ష‌ణ వ‌ర్గాలు అంటున్నాయి. దీన్ని ప్ర‌త్యేకంగా భూత‌ద్దంలో చూడాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఇప్ప‌టికే చాలా విమానాలు - వార్ ట్యాంక‌ర్ల‌ను అక్క‌డికి పంపించామ‌నీ, దాన్లో భాగంగానే ఈ క్షిప‌ణి కూడా వెళ్లింద‌ని చెబుతున్నారు. బ్ర‌హ్మోస్‌ ను స‌రిహ‌ద్దుకు తీసుకొచ్చినంత మాత్రాన చైనాకి హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్టు ఎలా అవుతుంద‌ని ప్ర‌శ్నించారు. ఇది చైనాకు అల‌వాటైన వాగుడు అనీ, భార‌త్ ఏం చేసినా త‌మ‌కు వ్య‌తిరేకంగా క‌య్యాని కాలుదువ్వుతోంద‌న్న‌ట్టు చిత్రీక‌రించే వ్యాఖ్య‌లు చేయ‌డం బాగా అల‌వాటు అని ర‌క్ష‌ణ శాఖ కొట్టి పారేసింది.
Tags:    

Similar News