చైనా చ‌ర్య‌తో యుద్ధం త‌ప్ప‌ద‌న్న‌ట్లేనా?

Update: 2017-07-04 12:12 GMT
ఇరుగుపొరుగున ఉన్న భారత్, చైనా మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ముఖ్యంగా చైనా దూకుడు చర్య‌ల‌తో ఉభయ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయని అంత‌ర్జాతీయ విశ్లేష‌కులు వెళ్ల‌డిస్తున్నారు. స్థిరదీక్షతో భూభాగాలను రక్షించుకుంటుందని చైనా విశ్లేషకులు -  చైనా మీడియా వ్యాఖ్యానిస్తుండగా...పరిస్థితి అదుపు తప్పితే యుద్ధానికి దారితీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ - చైనా - భూటాన్‌ లోని సరిహద్దు ప్రాంతమైన డోకా-లాలో గత నెల రోజులుగా ప్రతిష్ఠంభన నెలకొన్న సంగ‌తి తెలిసిందే. దీనికితోడు తాజాగా చైనీస్ యుద్ద నౌకలు అనుహ్యరీతిలో భారత్ కు ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రంలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదే స‌మ‌యంలో చైనా దూకుడు చ‌ర్య‌ను మ‌న‌దేశం నిశితంగా గ‌మ‌నిస్తోంది.

భారత్ - చైనా - భూటాన్‌ లోని సరిహద్దు ప్రాంతమైన డోకా-లాలో గత నెల రోజులుగా ప్రతిష్ఠంభన నెలకొంది. దీనికి తోడు భారత్ అక్కడ భారీ ఎత్తున సైనిక బలగాలను మోహరించింది. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన చైనా సరిహద్దు లెక్క పక్కాగా ఉందని, ఇండియా తగ్గితే మంచిదని ఆ దేశ విదేశాంగశాఖ నోటీసు జారీ చేసింది. డోకా-లా ప్రాంతంలో రోడ్డు నిర్మించకుండా అడ్డుకోవడం ద్వారా భారత్ వెన్నుపోటుకు పాల్పడుతున్నదని చైనా ఆరోపించింది. ఇప్పుడున్నది 1962 నాటి భారత్ కాదని రక్షణమంత్రి అరుణ్‌ జైట్లీ చేసిన వ్యాఖ్యలపై చైనా పెడసరంగా స్పందించింది. మాది కూడా 1962 నాటి చైనా కాదని బీజింగ్ వ్యాఖ్యానించింది. ప్రాదేశిక సార్వభౌమతాన్ని పరిరక్షించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని హెచ్చరించింది. 1962 యుద్ధం నుంచి భారత్ గుణపాఠం నేర్చుకోవాలని చైనా చేసిన వ్యాఖ్యలకు స్పందనగా జైట్లీ అప్పటి భారత్ ఇప్పటి భారత్ ఒక్కటి కాదని అన్నారు.

సిక్కిం సెక్టార్‌ లో రెండు దేశాల సరిహద్దులు 1890 నాటి చైనా-బ్రిటిష్ ఒప్పందంలో ఖరారయ్యాయి. ఆమేరకు భారత్ తన దళాలను ఉపసంహరించుకోవాలి అని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి జెంగ్ షువాంగ్ స్ప‌ష్టం చేశారు. భూటాన్‌ ను అడ్డుపెట్టుకుని భారత్ దళాలు తమ భూభాగంలోకి చొచ్చుకు వచ్చాయని, గందరగోళం సృష్టించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు నిరర్థకమని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానానికి ఇది వ్యతిరేకమని చైనా విదేశాంగ ప్రతినిధి నొక్కిచెప్పారు. 1890 ఒప్పందాన్ని సమర్థిస్తూ 1959లో అప్పటి భారత్ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చైనా ప్రధాని చౌఎన్‌ లైకి లేఖరాశారు. తదనంతర కాలంలో వచ్చిన ప్రభుత్వాలు ఇదే విధానాన్ని కొనసాగించాయి అని షువాంగ్ గుర్తుచేశారు. సిక్కిం సెక్టార్ ఘటనల నేపథ్యంలో మూసేసిన నాథూ-లా కనుమకు బదులుగా లిపూలేఖ్ కనుమ గుండా కైలాస్ మానసరోవర యాత్రను కొనసాగించుకోవచ్చని చైనా విదేశాంగ ప్రతినిధి తెలిపారు. ఈ కనుమ గుండా భారతీయులు రాకపోకలు సాగించడంపై ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు.

భారత్ - చైనా మధ్య తలెత్తిన ఘర్షణ విషయంలో సరైన రీతిలో వ్యవహరించకపోతే యుద్ధానికి దారితీసే అవకాశాలున్నాయని బీజింగ్‌ లోని అధ్యయన సంస్థలు అంటున్నాయి. ఘర్షణ లేదా యుద్ధం మీద కాకుండా ఉభయపక్షాలు అభివృద్ధి మీద దృష్టి నిలపాలి అని షాంఘై ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌ లోని ఏషియా-పసిఫిక్ సెంటర్ డైరెక్టర్ ఝావ్ గాంచెంగ్ వ్యాఖ్యానించినట్టు ఆ పత్రిక రాసింది. రెండు దేశాల మధ్య ఘర్షణ అమెరికా వంటి ఇతర దేశాలకు ప్రయోజనకరంగా మారవచ్చని ఆయన హెచ్చరించారు. భారత్ చైనా పట్ల తన ద్వేషపూరిత వైఖరిని మార్చుకోవాలని గాంచెంగ్ సూచించారు. భారత రక్షణశాఖ సరిహద్దుల్లో సైనిక కదలికల కోసం రైల్వేలైను నిర్మాణంపై సర్వేలు జరిపిస్తున్నదన్న వార్తలపై చైనా విశ్లేషకులు అభ్యంతరం వెలిబుచ్చారు. కాగా, జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోవల్ ఈ నెల 26న, బ్రిక్స్ దేశాల సమావేశానికి హజరుకానున్నారు. ఈ సమయంలోనే చైనా ఎన్ ఏస్ ఏ యాంగ్ జీచీతో సిక్కింపై చర్చించే అవకాశం ఉందని వార్త‌లు వెలువ‌డుతున్నాయి.


Tags:    

Similar News