జ‌గ‌న్ బాట‌లోనే చంద్ర‌బాబు న‌డుస్తున్నారే!

Update: 2017-07-12 05:42 GMT
న‌వ్యాంధ్ర‌లో ఇప్పుడు స‌రికొత్త రాజ‌కీయం న‌డుస్తోంది. సాధార‌ణంగా అధికారంలో ఉన్న పార్టీలు... విప‌క్షాల‌కు మార్గ‌ద‌ర్శ‌నం చేస్తాయి. ఎందుకంటే... అధికార పార్టీ చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌ను కాపీ కొట్టేసే విప‌క్షాలు... త‌దుప‌రి ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారంలోకి వ‌చ్చేయాల‌న్న భావ‌న‌తో ముందుకెళ‌తాయి కాబ‌ట్టి. అయితే న‌వ్యాంధ్ర‌లో ఇప్పుడు ఇందుకు రివ‌ర్స్ రాజ‌కీయం న‌డుస్తోంది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో అధికారం చేజిక్కించుకున్న టీడీపీ... ఇప్ప‌టికే మూడేళ్ల‌కు పైగా పాల‌న‌ను ముగించుకుంది. మ‌రో ఏడాదిన్న‌ర‌లో రానున్న ఎన్నిక‌ల్లో మ‌రో ద‌ఫా అధికారం చేజిక్కించుకునేందుకు ఆ పార్టీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు త‌న‌కు అందుబాటులో ఉన్న అన్ని అవ‌కాశాల‌ను వినియోగించుకునేందుకు రంగంలోకి దిగిపోయారు. మొన్న‌టిదాకా ఇలాంటి ఆలోచ‌నే లేకుండా... అభివృద్ధే త‌మ‌ను గెలిపిస్తుంద‌న్న ధీమా ఆయ‌న‌లో క‌నిపించింది. అయితే మొన్న గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున వ‌ర్సిటీ స‌మీపంలో జ‌రిగిన విప‌క్షం వైసీపీ ప్లీన‌రీతో మొత్తం ప‌రిస్థితే మారిపోయింది. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌న్న చందంగా అధికార పార్టీ వ్యూహాలు తెర‌పైకి వ‌చ్చాయి.

మొన్న‌టి ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప మార్జిన్‌తో అధికారం ద‌క్క‌ని ప‌రిస్థితుల్లో వైసీపీ విప‌క్షానికే ప‌రిమిత‌మైంది. ఎన్నిక‌ల‌కు ముందువ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ నేత‌గా, ఆ పార్టీ ఎంపీగా ఉన్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... పార్టీ అధిష్ఠానం వైఖ‌రితో విభేదించి పార్టీ నుంచి స్వ‌చ్ఛందంగా బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. వైసీపీ పేరిట సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ద‌మ్మున్న రాజ‌కీయ వేత్త‌గా త‌న‌ను తాను నిరూపించుకునేందుకు భారీ సాహ‌స‌మే చేసిన ఆయ‌న త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో పాటు నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉండి త‌న పార్టీలోకి చేరిన శాస‌న‌స‌భ్యుల‌తో రాజీనామాలు చేయించి మ‌రీ ఎన్నిక‌ల‌కు వెళ్లారు. ఆ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన వైఎస్ జ‌గ‌న్‌... త‌న స‌త్తా ఏమిటో చెప్ప‌క‌నే చెప్పేశారు. క‌డ‌ప లోక్ స‌భ స్థానం నుంచి రికార్డు స్థాయి మెజారిటీతో అటు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు టీడీపీకి దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చారు. మొన్న‌టి ఎన్నిక‌ల‌కు ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేందుకు *గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైసీపీ* పేరిట ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన‌ప్ప‌టికీ ఆ పార్టీ ఆ కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగించింది. భ‌విష్య‌త్తులోనూ ఆ కార్య‌క్ర‌మం కొనసాగించ‌నున్న‌ట్లు కూడా ఆ పార్టీ స్ప‌ష్టంగా ప్ర‌క‌టించింది.

ఇక మొన్న‌టి ప్లీన‌రీలో ఎన్నిక‌ల శంఖారావాన్ని పూరించిన వైఎస్ జ‌గ‌న్‌.. త‌న తండ్రి, దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌ర‌హాలోనే భారీ పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆరు నెల‌ల పాటు 3 వేల కిలో మీట‌ర్ల‌కు పైగా జ‌ర‌గ‌నున్న ఈ యాత్ర‌తో ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే వెళతాన‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న రానంత‌వ‌ర‌కూ ఎన్నిక‌ల‌కు వెళ్లే దిశ‌గా టీడీపీ ఏమాత్రం హ‌డావిడి చేయ‌లేద‌నే చెప్పాలి. అయితే ఈ ప్ర‌క‌ట‌న వ‌చ్చిన వెంట‌నే టీడీపీ గాభ‌రా ప‌డిపోయింద‌న్న వాద‌న వినిపిస్తోంది. వెంట‌నే తాను కూడా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లేందుకంటూ ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఆ కార్య‌క్ర‌మం పేరును *ఇంటింటికీ టీడీపీ* అని కూడా ప్ర‌క‌టించింది. వైసీపీ కార్య‌క్ర‌మంగా జ‌నాన్ని బాగానే ఆక‌ట్టుకున్న *గ‌డ‌ప‌గ‌డప‌కూ వైసీపీ* కార్య‌క్ర‌మం త‌ర‌హాలోనే టీడీపీ *ఇంటింటికీ టీడీపీ* పేరును ప్ర‌క‌టించింద‌న్న వాద‌న వినిపిస్తోంది.

గ‌తేడాది స‌భ్య‌త్వ న‌మోదు, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకంటూ ఏకంగా నెల రోజుల పాటు *జ‌నచైత‌న్య యాత్ర‌*ల పేరిట టీడీపీ భారీ హంగామానే చేసింది. అయితే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చేది లేదంటూ కేంద్రం స్ప‌ష్టంగా చేసిన ప్ర‌క‌ట‌న‌తో ఈ కార్య‌క్ర‌మం అంత‌గా సక్సెస్ కాలేదు. ఎక్క‌డికక్క‌డ జ‌రిగిన ప్ర‌త్యేక హోదా ఉద్య‌మాల‌తో ఉక్కిరిబిక్కిరి అయిన టీడీపీ... జ‌న‌చైత‌న్య యాత్ర‌ల‌ను అట‌కెక్కించ‌క త‌ప్ప‌లేద‌ని కూడా నాడు విశ్లేష‌ణ‌లు వినిపించాయి. తాజాగా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లేందుకూ జ‌న‌చైత‌న్య యాత్ర‌ల పేరిటే టీడీపీ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించే వీలున్నా... అచ్చం ప్ర‌జ‌ల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్న *గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైసీపీ* త‌ర‌హాలో కొత్త‌గా *ఇంటింటికీ టీడీపీ* పేరును ప్ర‌క‌టించిన‌ట్లుగా విశ్లేష‌కులు చెబుతున్నారు. అంటే... వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోమారు అధికారం ద‌క్కించుకునేందుకు చంద్ర‌బాబు...విప‌క్ష నేత‌గా ఉన్న వైఎస్ జ‌గ‌న్ బాట‌లోనే న‌డిచేందుకు సిద్ధ‌మైపోయార‌న్న మాట‌.
Tags:    

Similar News