ఇరువురు మధ్య సీటు పోరు...జగన్ తీరుస్తారా ?
వైసీపీలో సీట్ల పంచాయతీ మొదలైందా అంటే ప్రచారం చూస్తే అలాగే ఉంది. 2024 ఎన్నికలు జరిగి ఏణ్ణర్థం మాత్రమే అయింది.;
వైసీపీలో సీట్ల పంచాయతీ మొదలైందా అంటే ప్రచారం చూస్తే అలాగే ఉంది. 2024 ఎన్నికలు జరిగి ఏణ్ణర్థం మాత్రమే అయింది. అఫ్ కోర్స్ 2026లోకి అంతా అడుగు పెడుతున్నారు అనుకోండి. మరో ఆరు నెలలు గడిస్తే రెండేళ్ళు అవుతాయి. ఇక చివరి ఏడాది ఎన్నికల కోసం తీసేస్తే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి గట్టిగా ఉండేది రెండేళ్ళు మాత్రమే. ఇక విపక్షానికి కూడా అంతే సమయం ఉంటుంది. దాంతోనే కాబోలు ఇప్పటి నుంచే వైసీపీలో సీట్ల కోసం హడావుడి కనిపిస్తోంది. ఈసారి తాము గెలిచే సీటు కావాలని ఇప్పటి నుంచే అధినేతకు విన్నపాలు చేసుకుంటున్నారుట.
వద్దే వద్దు :
ఇక వీరిలో చాలా మంది సీనియర్ నేతలు కూడా ఉన్నారని అంటున్నారు. గుంటూరు జిల్లాలోని గురజాల మాజీ ఎమ్మెల్యే వైసీపీ కీలక నేత జగన్ కి సన్నిహితుడు అయిన కాసు మహేష్ రెడ్డి కూడా ఉన్నారని అంటున్నారు. ఆయన గురజాల నుంచి 2019లో పోటీ చేసి వైసీపీ వేవ్ లో గెలిచారు. అయితే 2024లో మాత్రం ఓటమి పాలు అయ్యారు. ఇక 2029 ఎన్నికల కోసం ఆయన ఇప్పటి నుంచే ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు అని అంటున్నారు. గురజాల నుంచి పోటీకి మాత్రం ఆయన పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు అని చెబుతున్నారు.
నరసరావుపేట కోసం :
ఆయన నరసరావుపేట అసెంబ్లీ సీటు మీద మోజు పెంచుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఆయన కుటుంబం రాజకీయంగా ఎదిగింది బలపడింది అంతా నరసరావుపేట నుంచే. దాంతో పాటు కాసు కుటుంబానికి అతి పెద్ద బలగం, బంధు గణం కూడా అక్కడ ఉంది. దాంతో అక్కడ నుంచి పోటీ చేస్తే డ్యాం ష్యూర్ గా గెలుస్తాను అని ఆయన భావిస్తున్నారు. దాంతో అధినేత జగన్ కి ఈ విషయంలో విన్నపాలు చేసుకుంటున్నారు అని ప్రచారం అయితే సాగుతోంది.
సీనియర్ నేత సీటు :
అయితే నరసరావుపేటలో సీనియర్ వైసీపీ నేతగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయన బలమైన నాయకుడే కాదు పార్టీ నుంచి రెండు సార్లు గెలిచి వచ్చారు. 2024లో ఓటమి చూశారు. ఇక వైద్యునిగా కూడా మంచి పేరు ఉంది. ఆయన సొంత సీటుగా నరసరావుపేట ఉంది. దాంతో పాటు గోపిరెడ్డి కూడా జగన్ కి అత్యంత సన్నిహిత నేత కావడం విశేషం. దాంతో కాసు మహేష్ రెడ్డికి ఆ సీటు కావాలంటే ముందు నుంచి అక్కడ ఉన్న గోపిరెడ్డిని తప్పించడం అంటే బహు కష్టం అన్న మాట వినిపిస్తోంది.
పెద్ద సమస్యగానే :
దీంతో ఈ విషయం గుంటూరు వైసీపీలో అయితే నలుగుతోంది. జగన్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే ఇద్దరూ కావాల్సిన నేతలే. రెండు సీట్లూ కీలకమే. గురజాల కనుక కాసు వదిలేస్తే అక్కడ పోటీకి కూడా మరో నేతను వెతుక్కోవాల్సి ఉంటుంది. దాంతో కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఇక గురజాల టీడీపీకి కంచుకోటగా మారిన సీటు. ఇక్కడ నుంచి టీడీపె ఏకంగా అయిదు సార్లు గెలిచింది. కాంగ్రెస్ మూడు సార్లు వైసీపీ ఒకస్దారి ఇండిపెండెంట్ ఒకసారి గత పది ఎన్నికల డేటా చూస్తే విక్టరీ కొట్టినట్లుగా ఉంది. దాంతో టీడీపీకి బలమైన సీటులో పోటీ చేస్తే 2029లో కూడా ఇబ్బందులు వస్తాయన్న దూరాలోచనతోనే కాసు సీటు మారుస్తున్నారా అన్న చర్చ సాగుతోందిట. మరి జగన్ ఈ విషయంలో ఇపుడే ఏమీ చెప్పేది ఉండదని సరైన సమయంలోనే నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు.