భూగ్రహంపై ఆ పదిమంది తలచుకుంటే... ప్రపంచ మార్పు ఇదే..!
ఈ క్రమంలో ఆ పది మంది మొత్తం సంపదలో సగం.. దాదాపు 1.30 ట్రిలియన్ డాలర్లు.. డాలర్ తో రూపాయి మారకం తాజా విలువ ప్రకారం లెక్కేస్తే మన కరెన్సీలో సుమారు రూ.114 లక్షల కోట్లు!;
ప్రపంచ జనాభా సుమారు 8.3 బిలియన్లు ఉంటుందనేది తాజా అంచనా కాగా.. అందులో దాదాపు 1.1 బిలియన్ల మంది తీవ్ర పేదరికంలో ఉండగా.. వారిలో దాదాపు 880 మిలియన్ల మంది ఏదో ఒక వాతావరణ ప్రమాదానికి గురవుతున్నారు. ఈ వందల కోట్ల జనాభా సంగతి అలా ఉంటే... ఇందులో ప్రపంచ వ్యాప్తంగా కేవలం 10 మంది ఈ భూగ్రహంపై ఉన్న అత్యంత ధనవంతులుగా ఉన్నారు. వారి సంపదలో సగం దానం చేస్తే.. ఈ ప్రపంచ రూపురేకలు ఎలా మారతాయి..?
అవును... అత్యంత ఆసక్తికర విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ జనాభాలో ఎన్ని వందల కోట్ల మంది ప్రజానికం ఉన్నప్పటికీ.. కేవలం 10 మంది చేతుల్లో అత్యధిక ఆదాయం ఉంది. ఇందులో భాగంగా... ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, లారీ పేజ్, సెర్గీ బ్రిన్, మార్క్ జుకర్ బర్గ్, లారీ ఎల్లిసన్, బెర్నార్డ్ ఆర్నాల్ట్, జిమ్ వాల్టన్, రాబ్ వాల్టన్, వారెన్ బఫెట్ లు ఈ భూగ్రహంపై ఉన్న కుభేరులుగా ఉన్నారు. వారి చేతుల్లోనే ఈ ప్రపంచ ధనం అత్యధికంగా ఉంది!
ఈ క్రమంలో ఆ పది మంది మొత్తం సంపదలో సగం.. దాదాపు 1.30 ట్రిలియన్ డాలర్లు.. డాలర్ తో రూపాయి మారకం తాజా విలువ ప్రకారం లెక్కేస్తే మన కరెన్సీలో సుమారు రూ.114 లక్షల కోట్లు! ఇంత సంపదను ప్రపంచానికి పంచేయాలని ఆ పదిమంది నిర్ణయం తీసుకుంటే.. ప్రపంచంలోని పేదరికం, ఆరోగ్య సమస్యలు, నిరక్షరాస్యత మొదలైన సమస్యలు ఏ మేరకు రూపుమాసిపోతాయి అనేది ఆసక్తిగా మారింది.
ఆహార భద్రత, గృహ స్థిరత్వం!:
ప్రతీ మనిషికీ కూడు, గూడు, గుడ్డ కనీస అవసరాలనే సంగతి తెలిసిందే. మిగిలిన సౌకర్యాల సంగతి కాసేపు పక్కనపెడితే... ఈ కనీస సదుపాయాలు లేని జనాభాకు ఈ లోకంలో లోటు లేదని అంటారు. ఈ నేపథ్యంలో... ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా అంతటా వీరి సహాయాలను ప్రత్యక్ష నగదు బదిలీ చేస్తే... ఆహార భద్రత, గృహ స్థిరత్వం మెరుగు పడటంతో పాటు.. తల్లుల, పిల్లల పోషాకాహార సమస్యలు రూపుమాసిపోతాయని అంటున్నారు.
వాతావారణ మార్పుల ప్రభావాలు!:
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు, మౌలిక సదుపాయాలు, జీవనోపాధిని వాతావరణ మార్పుల ప్రభావాలు ప్రభావితం చేస్తున్నాయని.. దీని వల్ల కలిగే నష్టం గణనీయంగా పెరుగుతుందని.. ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ అన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) తాజా నివేదిక వెళ్లడిస్తున్న నేపథ్యంలో... ఈ విపత్తుల నుంచి కోలుకోవడానికి, స్థితితాపకతను పెంచుకోవడానికి 2030 నాటికి సుమారు 300 నుంచి దాదాపు 600 బిలియన్ డాలర్లు అవసరమవుతాయి!
ప్రపంచ ఆరోగ్యం - ప్రాథమిక సంరక్షణ:
ఇదే క్రమంలో... యాక్ట్-యాక్సిలరేటర్ ఫ్రేమ్ వర్క్ ఉపయోగించి 2022 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ బ్యాంక్ విశ్లేషణ ప్రకారం... తరచుగా అట్టడుగున కనిపించే ప్రపంచ ఆరోగ్యం.. భవిష్యత్తు మహమ్మారికి ప్రపంచాన్ని సిద్ధం చేయడానికి ఏటా సుమారు 31 బిలియన్ డాలర్లు అవసరం అవుతాయి. ఇదే సమయంలో విస్తృత ప్రాథమిక సంరక్షణ సాధించడానికి ఏటా సుమారు 250 బిలియన్ డాలర్ల పెట్టుబడి అవసరం అవుతుంది. 1.30 ట్రిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది ఎంత..?
ప్రపంచ వ్యాప్తంగా నలుగురిలో ఒకరు క్రమం తప్పకుండా తినడానికి ఇబ్బందులు పడుతున్న రోజుల్లో భారీగా పెరుగుతున్న బిలియనీర్ల సంపదలో సగం పంచడం అనేది ప్రాక్టికల్ గా సాధ్యమా కాదా అనే సంగతి కాసేపు పక్కనపెడితే... జరిగే పరిణామాలు మాత్రం దాదాపుగా పేదరికం లేని సమాజం.. పర్యావరణ సమస్యలను కట్టడి చేసే ప్రపంచం.. ఆహార భద్రతకు లోటు లేని ప్రజానికం కనిపించడం సాధ్యం!!
కాగా... అంతర్జాతీయ మీడియాకు గత ఏడాది ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ ఛారిటీకి సుమారు 100 బిలియన్ డాలర్లకు పైగా విరాళం ఇవ్వగా.. తాను ఇంకా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే! ఇదే సమయంలో గేట్స్ కు మంచి స్నేహితుడైన వారెన్ బఫెట్ తన సంపదలో 99% విరాళంగా ఇస్తానని ప్రమాణం చేయడమే కాకుండా.. ఇతరులు కూడా ఇలాంటి ప్రతిజ్ఞ చేయాలని ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన గత ఏడాది జూన్ నాటికే సుమారు 60 బిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు.