షాకింగ్ ధరలు... పండగంతా ప్రైవేట్ ట్రావెల్స్ లోనే..!

క్రిస్మస్ పండుగ, ఆపై నూతన సంవత్సరం, తర్వాత సంక్రాంతి సందడి వెరసి పట్టణాలు పెద్ద ఎత్తున పల్లెలకు వెళ్లే సమయం ఇది.;

Update: 2025-12-23 03:36 GMT

క్రిస్మస్ పండుగ, ఆపై నూతన సంవత్సరం, తర్వాత సంక్రాంతి సందడి వెరసి పట్టణాలు పెద్ద ఎత్తున పల్లెలకు వెళ్లే సమయం ఇది. ఈ సందర్భంగా ప్రధానంగా హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల నుంచి జనాలు పల్లెలకు వెళ్తుంటారు.. పండుగ వేళ కన్నవారితో సొంత ఊరిలో ఉంటూ బంధువులు, స్నేహితులతో కలిసి ఉండాలని కోరుకుంటారు. సరిగ్గా దీన్నే ప్రైవేట్ ట్రావెల్స్ అదనుగా భావిస్తున్నాయి.. బలంగా బాదేస్తున్నాయి.

అవును... పండుగల సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికులను ఏ స్థాయిలో బాదుతాయనే విషయం చాలా మందికి స్వీయానుభవమే. అలా అని ప్రశ్నించలేని పరిస్థితి.. ప్రశ్నించి, అదుపు చేయాల్సినవారు మిన్నకున్న స్థితి! ఈ నేపథ్యంలో ప్రతీ పండక్కీ.. ప్రధానంగా క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సమయంలో సామాన్యుడు ఆ బాధుడికి బలైపోతూనే ఉన్నాడు. కారణం ఏదైనా.. రవాణా శాఖ అధికారులు చూస్తూనే ఉంటున్నారు!

ఉదాహరణకు.. సాధారణంగా హైదరాబాద్ నుంచి గోదావరి జిల్లాలకు లగ్జరీ ప్రైవేటు బస్సు టిక్కెట్ ధర రూ.1,000 నుంచి రూ.1,200 లోపు ఉండగా.. పండుగ సీజన్ లో రూ.2,500 నుంచి రూ.3,000 వరకూ ఉండటం గమనార్హం. అంటే.. ఓ కుటుంబంలో నలుగురు వ్యక్తులు పండక్కి ఊరు వెళ్లాలంటే.. కేవలం బస్సు టిక్కెట్లకే రూ.12,000 అవుతుందన్నమాట. అంటే.. ఇక పండగంతా ప్రైవెట్ ట్రావెల్స్ లోనే అన్నమాట.

ఇక తెలుగు వారు ఎక్కువగా ఉండే పక్క రాష్ట్రంలోని బెంగళూరు విషయానికొద్దాం..! అక్కడ నుంచి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు పండగల కోసమని వెళ్లే వారు ఎక్కువగానే ఉంటారు. వారిని లక్ష్యంగా చేసుకుని "ప్రైవేట్" దందా మొదలైపోయింది. అది ఏ స్థాయిలో అంటే ఫ్లైట్ టిక్కెట్లే బెటరెమో అనే స్థాయిలో! తాజాగా ఆన్ లైన్ లో చెక్ చేస్తే కనిపించిన నెంబర్స్ ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి.

మరి ఈ దందాపై రాష్ట్ర రవాణా యంత్రాంగం దృష్టి సారించడం లేదా.. మోటారు వాహన చట్టాల్లోని నిబంధనలను నిలువునా ఉల్లంఘించినా పట్టించుకోరా అంటే.. అది అధికారులకే తెలియాలి!. కాకపోతే ఏదైనా ప్రమాధం జరిగినప్పుడు మాత్రం ఈ విషయాలన్నీ కొన్ని రోజులు చర్చలో ఉంటాయి.. ఆ తర్వాత అధికారులతో పాటు ప్రజలూ మరిచిపోతుంటారని అంటారు. ఈ క్రమంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ షాకింగ్ విషయం ఇప్పుడు చూద్దామ్..!

బెంగళూరు నుంచి ఇతర రాష్ట్రాల ప్రధాన నగరాలకు 1,200కు పైగా ప్రవేటు బస్సులు నడుస్తుంటాయి. ఈ క్రమంలో తాజా పండగల వేళ టిక్కెట్ ధరలను ఒక సారి పరిశీలిస్తే... బెంగళూరు నుంచి హైదరాబాద్ ఇండిగో విమానం ధర ఈ నెల 31న రూ.3,617 చూపిస్తే.. ఇదే రోజున ఓ ప్రైవేటు బస్సు ఆన్ లైన్ టిక్కెట్ ధర రూ.3,572 చూపించిన పరిస్థితి. పండగ రోజుల్లో ప్రైవేటు బస్సుల దందాకు ఇంతకు మించి ఉదాహరణ అవసరం లేదేమో!

పరిస్థితి ఇలా ఉన్నపటికీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.. ఈ స్థాయిలో ధరలు పెరిగితే వారి దృష్టికి రాకుండా ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు.. తిలా పాపం తలా పిడికెడు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి ఈ సారి పండక్కి అయినా అధికారులు ఈ విషయాలపై దృష్టి సారిస్తారా.. లేక, "సర్దుకు"పోతారా అనేది వేచి చూడాలి!

Tags:    

Similar News