ముందు కేసీఆర్ తో మాట్లాడావా బాబు?

Update: 2018-09-01 05:16 GMT
క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి కుమారస్వామి బెజ‌వాడ‌కు వ‌చ్చారు. క‌న‌క‌దుర్గ‌మ్మ అమ్మ‌వారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చిన‌ట్లు చెప్పినా.. అస‌లు కార‌ణం కొడుకు పెళ్లి చూపుల‌క‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఈ ప‌ర్స‌న‌ల్ మేట‌ర్ ను ప‌క్క‌న పెడితే.. క‌ర్ణాట‌క సీఎం కుమార‌స్వామి.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును క‌లిశారు. ఈ సంద‌ర్భంగా బాబు నోటి నుంచి ఆణిముత్యంలాంటి మాట వ‌చ్చింది.

ద‌క్షిణాదిన ఉన్న ప్రాంతీయ పార్టీల‌న్ని క‌లిసి బీజేపీకి ఒక వ్య‌తిరేక కూట‌మిగా త‌యారు కావాల‌ని.. మోడీని మ‌రోసారి ప్ర‌ధాని కాకుండా చేయాల‌న్న కొత్త ల‌క్ష్యాన్ని ప్ర‌క‌టించారు. మొద‌ట ద‌క్షిణాదిలో ఒక కూట‌మిని త‌యారు చేసి.. త‌ర్వాత దేశ వ్యాప్తంగా ఎన్డీయే వ్య‌తిరేక కూట‌మికి రూపురేఖ‌లు తెచ్చి బ‌లోపేతం కావాల‌న్న ఆలోచ‌న‌ను చెప్పుకొచ్చారు.

బాబు చేసిన ప్ర‌తిపాద‌న చాలా మంచిద‌ని.. తాము కూడా ఆ దిశ‌గా ప‌ని చేస్తామ‌న్నారు. త‌మ రాష్ట్రంలో బీజేపీని అడ్డు చెప్పేందుకు కాంగ్రెస్ తో క‌లిసి ప‌ని చేస్తున్నామ‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తో క‌లిసి పోటీ చేస్తే.. త‌మ రాష్ట్రంలో బీజేపీకి రెండు ఎంపీ స్థానాలు మాత్ర‌మే ద‌క్కుతాయ‌ని పేర్కొన్నారు.

ద‌క్షిణాదిన బీజేపీకి సొంత బ‌లం ఉన్న రాష్ట్రం క‌ర్ణాట‌క ఒక్క‌టేన‌ని.. క‌ర్ణాట‌క‌లో త‌ప్పించి ద‌క్షిణాదిన మ‌రే రాష్ట్రంలోనూ బీజేపీ ఒక్క ఎంపీ సీటును గెలిచే ప‌రిస్థితులో లేద‌న్నారు. మోడీ పాల‌న‌లో స‌మాఖ్య స్ఫూర్తి మాయ‌మైంద‌ని.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో త‌ప్పించి ఇత‌ర రాష్ట్రాల‌కు సాయం అంద‌టం లేద‌న్న ఆగ్ర‌హాన్ని కుమార‌స్వామి వ్య‌క్తం చేశారు. ఇదే అభిప్రాయాన్ని బాబు కూడా వ్య‌క్తం చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

వ‌ర‌ద‌ల కార‌ణంగా బాగా దెబ్బ తిన్న కేర‌ళ‌కు కేంద్రం అందించిన సాయం మొక్కుబ‌డిగా ఉంద‌న్న అభిప్రాయాన్ని ఇరువురు ముఖ్య‌మంత్రులు వ్య‌క్తం చేసిన‌ట్లుగా స‌మాచారం.

ద‌క్షిణాదిన బీజేపీ వ్య‌తిరేక కూట‌మిని ఏర్పాటుకు బాబు వాద‌న‌ను తాను స‌మ‌ర్థిస్తున్న‌ట్లుగా కుమార‌స్వామి వెల్ల‌డించారు. ఇది మంచి ప్ర‌తిపాద‌న అని.. దీనికి త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌న్న వ్యాఖ్య‌ను ఆయ‌న చేశారు.  అంతా బాగానే ఉంది కానీ ద‌క్షిణాదిన బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంగ‌తేమిట‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఓవైపు బీజేపీకి ర‌హ‌స్య మిత్రుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేసీఆర్ ను కూడా వ్య‌తిరేక కూట‌మిలోకి తీసుకొస్తారా?  అందుకు ఆయ‌న్ను బాబు ఒప్పించ‌గ‌లుగుతారా?  త‌మ ప‌క్క‌నున్న తెలుగు రాష్ట్ర ముఖ్య‌మంత్రిని చంద్ర‌బాబు ఒప్పిస్తే చాల‌ని.. అదేమీ లేకుండా ద‌క్షిణాదిలో మోడీకి వ్య‌తిరేక కూట‌మి అంటూ డాబుస‌రి మాట‌ల‌తో ఏపీకి భారీగా న‌ష్టం వాటిల్లుతుంద‌ని చెబుతున్నారు. మిగిలిన రాజ‌కీయాలు ఎలా ఉన్నా.. మోడీని సైతం క‌న్వీన్స్ చేసి తాను అనుకున్న‌ది సాధించే కేసీఆర్ త‌ర‌హా మంత్రాంగం ఏపీకి అవ‌స‌రం. అలాంటిది వ‌దిలేసి.. ద‌క్షిణాది అంటూ కొత్త ప‌ల్ల‌వి కార‌ణంగా రాజ‌కీయంగా లాభ‌ప‌డొచ్చేమో కానీ.. ఏపీకి ప్ర‌యోజ‌నాల దృష్ట్యా మాత్రం భారీ న‌ష్టం వాటిల్లటం ఖాయ‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Tags:    

Similar News