టీడీపీ సీనియర్లు రిటైర్మెంట్ మోడ్ లో !
ఇక ఇదే బాటలో మరికొందరు టీడీపీ సీనియర్ నేతలు ఉన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్ మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు సైతం తన రాజకీయం ఇక చాలు అంటున్నారు.;
రాజకీయాల్లోకి వచ్చిన వారికి రిటైర్మెంట్ అన్న మాట ఉండదు, ఎందుకంటే అది ప్రజా సేవ. దానికి విరామం అంతూ పొంతూ ఉండదు, ఓపిక ఉన్నంతవరకు చేసుకుని పోవడమే. అందుకే దేశంలో డెబ్బై ఎనభైలు దాటిన పొలిటీషియన్లు కనిపిస్తారు. ఇది ఒక కారణం అయితే రెండవది అధికారం అలాగే కుర్చీ మోజు. ఒకసారి అధికారం హస్తగతం అయ్యాక ఎవరూ దానిని విడిచి ఉండలేరు. అయితే దేశ రాజకీయాలు ఎలా ఉన్నా ఏపీ రాజకీయాల్లో మార్పు కనిపిస్తోంది. రెండు తరాలు చూసి మూడవ తరం వైపుగా టీడీపీ సాగుతోంది. 2029 తరువాత నారా లోకేష్ నాయకత్వం వస్తుంది అని అంటున్నారు. దాంతో తమ బిడ్డలను రాజకీయ వారసులుగా చేసి అలా లోకేష్ బృందంలో వారిని చేర్చి తాము ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందామనుకునే సీనియర్లు టీడీపీలో అంతకంతకు పెరుగుతున్నారు.
ఉత్తరాంధ్రాలో చూస్తే :
ఇక ఉత్తరాంధ్రా జిల్లాలలో చూస్తే చాలా కీలక నేతల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అంటే అపజయం ఎరుగని నాయకుడు. ఆయన అయిదు సార్లు ఎమ్మెల్యేగా ఒక సారి ఎంపీగా పనిచేసి ఉన్నారు. కాంగ్రెస్ లో రెండేళ్ళు, టీడీపీలో అయిదేళ్ళు మొత్తంగా ఏడేళ్ళ పాటు మంత్రిగా కీలక శాఖలను గంటా చూశారు. ఏపీ రాజకీయాల్లో ప్రముఖంగా ఉంటూ ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన గంటా శ్రీనివాసరావు రాజకీయ విరమణ అంటే ఎవరూ ఊహినలేనిదే. అయితే ఆయన తన కుమారుడు రాజకీయ వారసుడు అయిన గంటా రవితేజా కోసం రాజకీయాల నుంచి తప్పుకోదలచుకున్నారని అంటున్నారు. ఇదే విషయం ఆయన టీడీపీ పెద్దల దృష్టిలో ఉంచారని చెబుతున్నారు. తన వారసుడికి 2029 ఎన్నికల్లో భీమిలీ టికెట్ దక్కించుకుని ఆ మీదట ఎమ్మెల్యేగా నెగ్గించుకుంటే చాలు అని గంటా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
అదే రూట్ లో :
ఇక ఇదే బాటలో మరికొందరు టీడీపీ సీనియర్ నేతలు ఉన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్ మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు సైతం తన రాజకీయం ఇక చాలు అంటున్నారు. ఆయన 1983లో అన్న ఎన్ టీఆర్ ద్వారా బీఫారం అందుకుని టికెట్ సాధించి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఎన్నో సార్లు మంత్రిగా పనిచేశారు. రాజ్యసభ ఎంపీగా కూడా ఆయన ఉన్నారు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కూడా ఆయన చాలా కాలం పనిచేశారు. అలాంటి కళా వెంకట్రావు తన కుమారుడు కిమిడి రాం మల్లిక్ ని ఎచ్చెర్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించి గెలిపించుకోవాలని చూస్తున్నారు. ఆ హామీ దక్కితే చాలు ఆయన రిటైర్మెంట్ అని దూరం జరుగుతారు అని అంటున్నారు.
పెద్ద జాబితానే :
ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు రాజకీయాలకు దూరంగా ఉంటాను అని తరచూ చెబుతూ వస్తున్నారు. ఆయన కుమారుడు విజయ్ పాత్రుడు 2029 ఎన్నికల్లో నర్శీపట్నం నుంచి పోటీ చేస్తారు అని అంటున్నారు. అలాగే మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి తన వారసుడు కుమారుడు అయిన బండారు అప్పలనాయుడుని మాడుగుల సీటు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయిస్తారు అని అంటున్నారు. ఆయన కూడా రిటైర్మెంట్ తీసుకోనున్నారని చెబుతున్నారు. సీనియర్ నేత మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా ఇక రాజకీయం చాలు అన్న ఆలోచనలో ఉన్నారు. ఆయన కుమారుడు దాడి రత్నాకర్ కి అనకాపల్లి టికెట్ ని కోరుతున్నారు. శ్రీకాకుళంలో కింజరాపు అచ్చెన్నాయుడు కుమారుడు టెక్కలి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు అని టాక్ నడుస్తోంది. అదే విధంగా పలువురు సీనియర్ నేతలు కూడా వాలంటరీ రిటైర్మెంట్ అంటున్నారు. అంతవరకూ బాగానే ఉన్నా ఇలా వీరి వారసులకే తిరిగి టికెట్లు దక్కుతాయా లేదా కొత్తవారికి ఇస్తారా అన్నదే చర్చగా ఉంది.