బంగ్లా హసీనాకూ కుమారుడున్నాడు.. అతడిదీ పెద్ద చరిత్రే తెలుసా?
సజీబ్ అహ్మద్ వాజెద్ జాయ్.. ఈ పేరు బంగ్లాదేశ్ ప్రజలకు బాగా పరిచయం. పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యం కోసం బంగ్లా విముక్తి ఉద్యమం జోరుగా సాగుతున్నకాలంలో 1971లో ఢాకాలో పుట్టారు వాజెద్.;
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఎగ్జిక్యూటివ్ చైర్మన్ తారిక్ రెహ్మాన్.. 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి రావడంతో బంగ్లాదేశ్ రాజకీయాలు కీలక మలుపుతిరిగాయి. ఈయన తల్లి, బీఎన్పీ చీఫ్, మాజీ ప్రధాని బేగం ఖలీదా జియాకు 80 ఏళ్లు దాటాయి. ఇప్పుడు ఆమె ఆస్పత్రిలో ఉన్నారు. అందుకనే తారిక్ ను స్వదేశానికి రప్పించారనే ప్రచారం ఉంది. ఖలీదాజియాకు ఏమైనా అయితే తారిక్ బీఎన్పీ పగ్గాలు చేపడతారు. వచ్చే రెండు నెలల్లో జరగనున్న ఎన్నికల్లో బహుశా ఈయనే పార్టీని నడిపించే చాన్సుందని చెబుతున్నారు.
అయితే, ఖలీదా కుమారుడు తారిక్ గురించి ఇప్పటివరకు ఎవరికీ పెద్దగా తెలియదు. ఇకమీదట ఏం చేస్తారో చూడాలి. ఈ విషయం ఇలా ఉంచితే.. ఖలీదా బద్ధ శత్రువు, ప్రస్తుతం భారత్ లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాకూ ఒక కుమారుడు ఉన్నాడు. తారిక్ లా అతడిది లోప్రొఫైల్ మాత్రం కాదు. ఒక దశలో బంగ్లా రాజకీయాల్లో చాలా కీలకంగా వ్యవహరించారు. తన తల్లి ప్రధానిగా ఉన్న సమయంలో ఆమెకు టెక్నాలజీ అడ్వైజర్ గా పనిచేశారు. తమ పార్టీ అవాలీ లీగ్ సభ్యుడు కూడా. కానీ, తారిక్‌లా అతడు స్వదేశానికి తిరిగి వచ్చే పరిస్థితుల్లో లేడు. అంతేకాదు.. దాదాపు రెండు దశాబ్దాల నుంచి అమెరికాలోనే ఉంటూ బంగ్లాకు వస్తూ పోతున్నారు. ఈ ఏడాది అమెరికా పౌరసత్వం కూడా పొందారు.
భారత్ లోనే విద్యాభ్యాసం
సజీబ్ అహ్మద్ వాజెద్ జాయ్.. ఈ పేరు బంగ్లాదేశ్ ప్రజలకు బాగా పరిచయం. పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యం కోసం బంగ్లా విముక్తి ఉద్యమం జోరుగా సాగుతున్నకాలంలో 1971లో ఢాకాలో పుట్టారు వాజెద్. ఈయన తండ్రి డాక్టర్ ఎంఏ వాజెద్ అణు శాస్త్రవేత్త. 1975లో హసీనా కుటుంబాన్ని సైనిక తిరుగుబాటులో చంపేశారు. దీంతో ఆమె తండ్రి, సోదరులను కోల్పోయారు. ఆ సమయంలో భర్త, చెల్లెలు రెహానా, కుమారుడితో కలిసి జర్మనీ నుంచి వస్తుండడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. తర్వాత ఆరేళ్లు భారత్ లోనే ప్రవాసంలో ఉన్నారు.
దీంతో వాజెద్ చదువు మన దేశంలోనే సాగింది. నైనిటాల్, తమిళనాడులోని పళని హిల్స్, కొడైకెనాల్ లో స్కూల్ చదువు, బెంగళూరులో కంప్యూటర్ సైన్స్ చదివాడు. తర్వాత అమెరికాలోని టెక్సస్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేశాడు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేశాడు. 2002లో క్రిస్టీన్ ఒవర్‌మైర్ ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె. ఈ ఏడాది క్రిస్టీన్ తో విడిపోయినట్లు ప్రకటించారు.
బంగ్లాలో కీలక పాత్ర
తల్లి ప్రధానిగా ఉండగా సజీబ్ బంగ్లా ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషించారు. పదేళ్ల కిందట ఈయనకు ప్రత్యేక భద్రతా దళం, ఇతర వసతులు ఇచ్చారు. గత ఏడాది హసీనా ప్రధానిగా దిగిపోయాక వీటిని తొలగించారు. కాగా, వ్యాపారవేత్తగానూ సజీబ్ కు పేరుంది. హసీనా పదవిని వదిలేసి గత ఏడాది భారత్ కు వచ్చేసిన సమయంలో అమెరికా నుంచి సజీబ్ ఓ సందేశం విడుదల చేశారు. ఇప్పటికీ తన తల్లి విషయమై తరచూ స్పందిస్తూ ఉంటారు. హసీనాతో పాటు సబీజ్ పైనా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పెద్ద ఎత్తున కేసులు పెట్టింది. ఈ నేపథ్యంలో ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహ్మాన్ తరహాలో సజీబ్ బంగ్లాదేశ్ కు రాలేరు.