అమరావతి పక్కన మహా నగరం
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని విస్తరించి గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ గా చేయాలని విజాయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ కోరుతున్నారు.;
అమరావతి రాజధాని దీర్ఘకాలంలోనే అందుబాటులోకి వస్తుందని అందరికీ తెలుసు. దాదాపుగా యాభై వేల ఎకరాలు ప్రస్తుతం ఉన్నాయి. మళ్ళీ భూసేకరణ చేపడుతున్నారు. టోటల్ గా ఎక్కడకు ఆగుతుందో తెలియదు. దాంతో పాటు ఆయా భూములలో అభివృద్ధి సాగాలి అంటే మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇవన్నీ అయ్యేసరికి ఎంత కాలం పడుతుంది అన్నది ఎవరూ చెప్పలేరు. అయితే ఏపీకి రాజధానిగా అమరావతి కళ్ల ముందు కనబడుతోంది. ఆ తృప్తి ఉంది. అలాగే మెల్లగా నిర్మాణాలు జరుగుతున్నాయి కాబట్టి అది ఏదో నాటికి అతి పెద్ద నగరంగా మారక తప్పదు. కానీ వర్తమానంలో చూస్తే అమరావతికి ఏమీ ప్రాజెక్టులు రావడం లేదు, ఐటీ సెక్టార్ అంతా విశాఖకు తరలిపోతోంది. అలాగే పరిశ్రమలు కూడా అటే వెళ్తున్నాయి. అలాగే ఇతర పరిశ్రమలు ఏవైనా ఉంటే రాయలసీమ వైపు వెళ్తున్నాయి. కియా లాంటివి దానికి ఉదాహరణ. మరి అమరావతి పరిసర ప్రాంతాలలో అభివృద్ధి జరగాలి కదా అన్న ప్రశ్నకు జవాబు మరో మహా నగరం అని అంటున్నారు. అదే గ్రేటర్ విజయవాడ అని అంటున్నారు.
డిమాండ్ భారీగానే :
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని విస్తరించి గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ గా చేయాలని విజాయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ కోరుతున్నారు. విజయవాడ నగరానికి ఒక సుస్థిరమైన ప్రణాళికబద్దమైన అభివృద్ది కోసం గ్రేటర్ సిటీ అవసరమని ఆయన అంటున్నారు. ఈ మేరకు ఆయన విజయవాడ తూర్పు శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో కలసి వినతిపత్రం అందించారు. గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు పై సత్వరమే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని ఆయన ఈ సందర్భంగా కోరారు. విజయవాడ నగర పరిసరాలలోని 75 గ్రామాలు విలీనమై గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ ఏర్పాటు జరిగితే పారిశ్రామిక కారిడార్లు, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్ హబ్‌లు, పర్యాటక పెట్టుబడులకు మరింత ప్రోత్సాహం లభించి, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ఆయన చెప్పారు.
ప్రభుత్వం సుముఖత :
విజయవాడను గ్రేటర్ సిటీగా చేసేందుకు కూటమి ప్రభుత్వం సుముఖంగా ఉందని అంటున్నారు. దీని వల్ల అమరావతి రాజధాని పక్కనే మరో మహా నగరం రెడీమేడ్ గా ఉంటుందని అంటున్నారు అలాగే రానున్న రోజులలో ఇన్వెస్టర్లు గ్రేటర్ సిటీ వైపు చూస్తారు అని అంటున్నారు. ఆ విధంగా విజయవాడ అభివృద్ధి సాధిస్తుందని గుంటూరు సహా ఇతర ప్రాంతాలు కూడా ప్రగతిపధంలో సాగుతాయని అంటున్నారు. దీని వల్ల అమరావతి పూర్తి స్థాయిలో సిద్ధమయ్యేలోగా పక్కన ఉన్న విజయవాడతో కలుపుకుని రాజధాని హోదా దక్కుతుందని ప్రజలు కూడా ఆనందంగా ఉంటారని ఆలోచిస్తున్నారు.
నంబర్ వన్ పొజిషన్ గా :
ఈ రోజున చూస్తే విజయవాడ కార్పోరేషన్ కేవలం యాభై వార్డులతో ఉంది. విశాఖ కార్పోరేషన్ గ్రేటర్ హోదాను దక్కించుకుని 99 వార్డులతో విస్తరించింది. దాంతో ఏపీలో గ్రేటర్ సిటీ అంటే విశాఖనే ఉంది. మరో 75 గ్రామాలను కలుపుకుని విజయవాడ విస్తరిస్తే మాత్రం ఏకంగా వందకు పైగా వార్డులతో అతి పెద్ద గ్రేటర్ సిటీగా అవతరిస్తుంది అని అంటున్నారు. దాంతో విజయవాడ ఏపీకే టాప్ సిటీ అవుతుందని ఏపీ వైపు చూసే పారిశ్రామిక వేత్తలకు తొలి ఆప్షన్ గా విజయవాడ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పటికే విశాఖ సహా ఇతర ప్రాంతాలలో అభివృద్ధి బాగా జరుగుతోంది కాబట్టి అమరావతి పరిసర ప్రాంతాలలో కూడా ప్రగతి ఊపందుకోవాలంటే గ్రేటర్ విజయవాడకు జై కొట్టాల్సిందే అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రతిపాదన ఎపుడు కార్యరూపం దాలుస్తుందో.