విమర్శలతో నోయూజ్.. పోరాటం చేయాల్సిందే!

Update: 2018-03-06 15:30 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంతకాలమూ ఎన్ని మాయమాటలు చెప్పినప్పటికీ.. ఇప్పటికైనా ప్రత్యేకహోదాకు అనుకూలంగా  మాట్లాడుతున్నారనే అనుకుందాం. కానీ, ఆయన కేంద్రాన్ని అదే పనిగా విమర్శిస్తూ ఉంటే.. పనైపోతుంది.. వారు జడుసుకుని... తాము కోరుకుంటున్నట్టుగా స్పందిస్తారు.. అని చంద్రబాబునాయుడు అనుకుంటున్నారేమో తెలియదు. నలభయ్యేళ్ల సీనియారిటీ ఉన్న నాయకుడు మరీ అంత అమాయకుడా అనే సందేహాలు కూడా కలుగుతాయి. రాష్ట్రానికి ఏం సాధించాలనుకున్నా.. తాను ఇన్నేళ్లుగా నడుస్తున్న దారి తప్పు... అని ఇంత దారుణంగా నిరూపణ అయిపోయిన తర్వాత కూడా.. ఆయన ఇంకా దెప్పిపొడుపు మాటలతో.. ‘మంచి పనులు చేసినప్పుడు మిమ్మల్ని కీర్తించాం కూడా’ అనే మెరమెచ్చు ముఖప్రీతి మాటలతో ఏం సాధించాలనుకుంటున్నారో మాత్రం తెలియదు.

చంద్రబాబునాయుడు ప్రజల ఎదుట - ప్రెస్ మీట్ లలో మాట్లాడుతున్నప్పుడు.. చాలా ఆవేశంగా పోరాడుతున్నాం సాధించేస్తాం అంటూ ఉంటారు.

వాస్తవంలోకి వచ్చేసరికి అక్కడ ఎలాంటి పోరాటమూ ఉండదు. లేదా, పార్లమెంటులో వెల్ లోకి వెళ్లి నినాదాలు చేయడమూ - అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం చేయడమూ మాత్రమే పోరాటం అని చంద్రబాబునాయుడు అనుకుంటున్నారేమో కూడా తెలియదు.

ఇవాళ  కూడా చంద్రబాబు అదే ప్రహసనాన్ని రిపీట్ చేశారు. విభజన హామీలకు సంబంధించి తెలుగుదేశం- భాజపాల మధ్య హాట్ హాట్ డిస్కషన్ నడించింది. ఏ రాష్ట్రానికీ హోదా లేదు అంటేనే ప్యాకేజీకి ఒప్పుకున్నాం.. అంటూ మసిగుడ్డ కాల్చి.. పక్కవాళ్ల మొహాన పడేసే పాత టెక్నిక్ నే చంద్రబాబునాయుడు మళ్లీ ఇక్కడ రిపీట్ చేశారు. తెలుగువారితో ఆడుకున్న కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని అంటూ.. మీకు కూడా అదే గతి పడుతుందని అన్నట్లుగా.. ఆయన భారతీయ జనతా పార్టీని హెచ్చరించే ప్రయత్నం చేశారు. మరోవైపు భాజపా చేసిన మంచి పనులు గురించి కూడా తాము చెప్పాం అని సమర్థించుకున్న చంద్రబాబు.. మిత్రపక్షం గనుకనే శాంతియుతంగా పోరాడుతున్నాం అంటూ సంజాయిషీ ఇచ్చుకున్నారు.

అయితే ఇలాంటి ముసుగులో గుద్దులాటలతో ప్రజలకు చిరాకెత్తుతోందన్న మాట వాస్తవం. ప్రత్యేకహోదా కోసం పోరాటాన్ని.. ప్రజలు - ఇతర విపక్షాలు - తటస్థ ఉద్యమకారులు అంతా కలిసి.. మరో రేంజికి తీసుకువెళ్లారు. ఖచ్చితంగా వారి ప్రత్యక్ష పోరాటాలు కేంద్రం మీద ఒత్తిడి పెంచుతున్నాయి. చంద్రబాబు ప్రత్యక్ష పోరాటానికి దిగే ప్రయత్నం చేయకుండా.. ఇంకా నాన్చుతూ ఉండడం జాతికి నష్టం అని పలువురు భావిస్తున్నారు.
Tags:    

Similar News