జపాన్ తరహా నిరసన.. చంద్రబాబుకేమైంది !

Update: 2018-03-21 17:22 GMT
దేశంలో తానే సీనియర్ లీడర్‌ నంటారు.. మిగతా నేతలు చెడ్డీలేసినప్పుడే తాను ప్రధాన మంత్రులను డిసైడ్ చేశానంటారు.. తన ప్రత్యర్థుల వయసు తన రాజకీయ అనుభవమంత లేదనీ అంటుంటారు. కానీ... ఇన్ని చెప్పే చంద్రబాబు నాయుడు ఎందుకనో తన సీనియారిటీని మాత్రం చిటికెడు కూడా చూపించలేకపోతున్నారు. ఏపీకి అన్యాయం చేసిన కేంద్రాన్ని మెడలు వంచి దారికి తెచ్చుకోవడంలో  పూర్తిగా వెనుకాడుతున్నారు. ఇక తప్పదని అర్థం చేసుకుని కేంద్రం నుంచి బయటకు రావడానికి - ఎన్డీయేకు రాంరాంచెప్పడానికి సాహసించారు కానీ, ఇంకా మోదీని చూస జడుసుకుంటున్నట్లే కనిపిస్తున్నారు. అవిశ్వాసం పెట్టినా ఇతర పార్టీల నేతలను కలిసిన దాఖలాలే లేవు. పార్టీ ఎంపీలే ఏదో తూతూమంత్రంగా హడావుడి చేస్తున్నారు. మరి.. అంత సీనియారిటీ ఉన్న చంద్రబాబు వచ్చి దిల్లీలో కూర్చోవచ్చుగా అన్న వాదన వినిపిస్తోంది.
    
మరోవైపు చంద్రబాబు వ్యూహాలు - అమలు చేస్తున్న కార్యాచరణ చూసి ఏపీ ప్రజలు షాకవుతున్నారు. జపాన్ తరహాలో ఎక్కువగా పనిచేసి నిరసన తెలుపుతానని చంద్రబాబు అంటుండడంతో జనం పగలబడి నవ్వుతున్నారు. ఈ రోజు ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి సాయం అందేవరకు తాము కూడా నిరసనల్లో పాల్గొంటామని ప్రకటన చేశారు.  
    
కేంద్ర ప్రభుత్వంపై పోరాడే క్రమంలో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే రాష్ట్రాభివృద్ధికి ఇబ్బంది కలుగుతుందని అన్నారు. అందుకే జపాన్ తరహాలో ప్రతిరోజు అర్ధగంట నిరసన చేద్దామని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఉద్యోగులంతా తమ కార్యాలయాల్లో మరో గంటసేపు ఎక్కువ పనిచేయాలని చంద్రబాబు చెప్పారు. అవసరమైతే నల్లబ్యాడ్జీలు పెట్టుకుందామని చెప్పారు. నిరసనల్లో భాగంగా నిరాహార దీక్షలు కూడా చేద్దామని అన్నారు. దీంతో చంద్రబాబు తీరుపై సోషల్ మీడియాలో విమర్శల కుంభవృష్టి కురుస్తోంది.

Tags:    

Similar News