బీజేపీని తెలివిగా ఇరికిస్తున్న బాబు

Update: 2016-07-30 09:05 GMT
సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యం నుంచి మిత్ర‌ప‌క్షంగా కొన‌సాగుతున్న టీడీపీ-బీజేపీల మైత్రి ఇక ముగిసిన అధ్యాయ‌మేనా? ప్రత్యేక హోదా అంశంలో కేంద్ర ప్ర‌భుత్వ నాన్చివేత దోర‌ణితో బాబు కొత్త ఎత్తుగడ‌కు శ్రీ‌కారం చుట్టారా?  బీజేపీ టార్గెట్‌ గా పెట్టుకున్న బాబు ఈ క్ర‌మంలో వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. మిత్ర‌ప‌క్షం అయిన‌ప్ప‌టికీ ఏపీకి అన్యాయం చేస్తున్న నేప‌థ్యంలో బీజేపీపై ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్లేందుకు బాబు సిద్ధ‌మ‌వుతున్నారని స‌మాచారం. రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ చేస్తున్న యత్నాలకు హోదా అంశంతో బ్రేకులు వేసి ఆ పార్టీని బలహీనపరచడం, తాము మిత్రపక్షమైనా కేంద్రంతో పోరాడుతున్నామన్న సంకేతాలివ్వడం ద్వారా పూర్తి రక్షణాత్మక వ్యూహాన్ని అనుసరించాలని టీడీపీ నిర్ణయించుకుందని తెలుస్తోంది.

ఏపీకి ప్ర‌త్యేక‌ హోదాపై బీజేపీ వైఖరిని జీర్ణించుకోలేని బాబు కొంతకాలం వ్యూహాత్మక మౌనం వహించారు. ఆ తర్వాత హోదా కోసం పోరాడే వ్యక్తులు - సంస్థలకు పరోక్ష మద్దతునిచ్చారు. అయితే బీజేపీ నుంచి సానుకూల స్పంద‌న లేని నేప‌థ్యంలో దూకుడు నిర్ణ‌యానికే మొగ్గుచూపారు. కొద్దిరోజుల క్రితం జరిగిన క్యాబినెట్ భేటీలో కూడా హోదాపై చర్చ సంద‌ర్భంగా కేంద్రాన్ని మనం ఉపేక్షించాల్సిన అవసరం లేదని, మన సహనానికీ హద్దు ఉందని బాబు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. హోదాపై మనకు పోరాడే హక్కు ఉన్నప్పుడు మొహమాటం అవసరం లేదని, స్నేహం వేరు రాజకీయాలు వేరనే దిశ‌గా నిర్ణ‌యం వెలువ‌డిన‌ట్లు చెప్తున్నారు. అనంతరం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కూడా బీజేపీపై తన అసంతృప్తిని ఎక్కడా దాచుకునే ప్రయత్నం చేయకుండా నాయ‌కులు మాట్లాడ‌టం ఆస‌క్తిక‌రం. ఆ తర్వాతనే తెదేపా ఎంపీలు - ఎమ్మెల్యేలు - అధికార ప్రతినిధులు బిజెపిపై స్వరం పెంచి విమ‌ర్శ‌లు చేయ‌డం గమనార్హం.

ఇక పార్టీ అధినేత‌గా చంద్రబాబు విష‌యానికి వ‌స్తే  ఆయ‌న నేరుగా బీజేపీని విమర్శించకుండా ప్రభుత్వాధినేతగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. మరోవైపు తన పార్టీ నేతలతో బీజేపీపై రాజకీయంగా విమర్శలు చేయిస్తున్నారు. ఇంకోవైపు ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా హోదా సహా అన్ని అంశాలపై చర్చించామని మీడియాకు చెబుతున్నారు. ఇవన్నీ కూడా హోదాపై త‌మ‌ తప్పిదం లేదన్న సంకేతాలే ఇస్తున్నాయని అంటున్నారు. త‌ద్వారా బాబు సేఫ్ గేమ్ ఆడుతున్న‌ర‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.
Tags:    

Similar News