కుప్పం టూర్ లో మారిన బాబు క‌నిపించారా?

Update: 2019-07-05 06:32 GMT
టీడీపీ అధినేత‌.. మాజీ ముఖ్య‌మంత్రి.. ఏపీ విప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న చంద్ర‌బాబు ప్ర‌స్తావ‌న వ‌చ్చినంత‌నే అదే ప‌నిగా మాట్లాడ‌టం.. మైకు క‌నిపిస్తే చాలు.. మీద ప‌డిపోవ‌టం లాంటివి చేస్తార‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తూ ఉంటుంది. త‌న‌ను తాను మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఉందంటూ బాబుపై ప‌లువురు చేస్తున్న వ్యాఖ్య‌ల ప్ర‌భావం బాబు మీద బాగానే ప‌డింద‌న్న మాట త‌ర‌చూ వినిపిస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాజ‌యాన్ని చ‌వి చూసిన బాబు మీద ఓట‌మి తాలుకూ ఎఫెక్ట్ బాగానే క‌నిపించింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత తాను ప్రాతినిధ్యం వ‌హించే కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో బాబు ప‌ర్య‌టిస్తున్నారు. కుప్పం నుంచి బ‌రిలో దిగే చంద్ర‌బాబుకు గ‌తంలో ఎప్పుడు రానంత త‌క్కువ మెజార్టీ తాజా ఎన్నిక‌ల్లో ఎదురైంది. ఈ విష‌యాన్ని ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తూ నిష్ఠూరం ఆడిన ఆయ‌న‌.. జ‌రిగిందేదో జ‌రిగిపోయింద‌న్న మాట‌ను చెప్ప‌టం క‌నిపించింది.

ఓట‌మి షాక్ ను మాట‌ల్లో చెప్పే ప్ర‌య‌త్నం చేసిన కార్య‌క‌ర్త‌ల‌నే కాదు.. దారుణ ప‌రాజ‌యాన్ని ప్ర‌స్తావిస్తూ వల‌వ‌ల ఏడ్చేసిన తమ్ముళ్ల‌కు స్థైర్యం నింపే ప్ర‌య‌త్నంతో పాటు.. మ‌రేం ఫ‌ర్లేద‌న్న ధీమాను ప్ర‌ద‌ర్శించే ప్ర‌య‌త్నం చేశారు. అన‌వ‌స‌ర ఆవేశానికి చెక్ పెడుతూ.. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడిన బాబు తీరు కొత్త‌గా ఉందంటున్నారు.

సాధార‌ణంగా త‌న టూర్ సంద‌ర్భంగా చిన్న అవ‌కాశం ల‌భించినా.. మైకు ప‌ట్టుకొని చెల‌రేగిపోయే బాబు.. కుప్పం టూర్లో మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు. మొత్తంగా నాలుగంటే నాలుగు స‌మాశాలు.. అందులోనూ రెండు బ‌హిరంగ స‌భ‌లు.. మ‌రో రెండు కార్య‌క‌ర్త‌ల స‌మావేశాల్లో మాట్లాడిన ఆయ‌న‌.. గ‌తానికి భిన్న‌మైన త‌ర‌హాలో మాట్లాడార‌ని చెప్పాలి.

తాను ఎప్పుడూ.. ఎక్క‌డా త‌ప్పు చేయ‌లేద‌న్న ధీమాను పెంచ‌టం ద్వారా తాను ధైర్యంగా ఉన్నాన‌న్న సందేశాన్ని బాబు పంపారు. అంతేకాదు.. క‌మిటీలు.. ప్ర‌జావేదిక‌.. ఇళ్ల కూల్చివేత ఘ‌ట‌న‌లు త‌న మీద ఎలాంటి ప్ర‌భావాన్ని చూపించ‌లేద‌న్న‌ట్లుగా బాబు తీరు ఉండ‌టం గ‌మ‌నార్హం. రానున్న రోజుల్లో ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటాన‌ని.. రానున్న స్థానిక ఎన్నిక‌ల్లో పార్టీ స‌త్తా చూపాల‌న్న ల‌క్ష్యంతో బాబు తీరు ఉంద‌న్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News