మోడీ ముందు మ‌రో స‌వాల్‌

Update: 2016-01-02 10:49 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్రమోడీ ఇమేజ్ డ్యామేజ్ అయిందా?  మోడీని త‌మ తురుపుముక్క‌గా భావించిన బీజేపీ...త‌మ ఉబ‌లాటం కాస్త అతి అయింద‌ని తెలుసుకొని ఆచితూచి అడుగులు వేస్తోందా? త‌్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో ప‌రిమిత స్థాయి ప్ర‌చారం ద్వారా మోడీ ఇర‌కాటంలో ప‌డేయ‌వ‌ద్ద‌ని చూస్తోందా? అంటే బీజేపీ నాయ‌కుల నుంచి అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

పశ్చిమ‌బెంగాల్ రాష్ట్రంలో గతంలో ఉన్న 6 శాతం ఓటు బ్యాంక్‌ ను 2014 సాధారణ ఎన్నికల్లో మోడీ ప్రభావంతో 17 శాతానికి పెంచుకోగలిగామన్న ధీమా స్థానిక బీజేపీ నేతల్లో ఉంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ... ఎన్నిక‌ల వ్యూహాల‌కు ఆయా పార్టీలు ఇప్ప‌టికే ప‌దునుపెడుతున్నాయి. ఈ క్ర‌మంలో అధికార తృణమూల్‌ పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకునే ప్రచార వ్యూహంపైనా స్థానిక బీజేపీ నేతలు దృష్టి సారించారు. సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ అధికారం చేపట్టిన తర్వాత ఆ రాష్ట్రంలో జరిగిన శారదా కుంభ కోణం - మహిళలకు రక్షణ లేకపోవడం, అభివృద్ధి కుంటుపడటంవంటి అంశాలపైనా బీజేపీ ప్రచారం చేయనున్నట్టు తెలుస్తోంది.

అయితే బీహార్‌ ఓటమి ద్వారా గట్టి ఎదురుదెబ్బ తిన్న బీజేపీ..త్వరలో ఎన్నికలు జరగనున్న ప‌శ్చిమ‌ బెంగాల్‌ విషయంలో పరువు కాపాడుకుంటూ ప్రచారాన్ని నిర్వహించే వ్యూహంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ప్రధాని నరేంద్రమోడీని ప్రచారానికి ఎక్కువగా ఉపయోగించకూడదని నిర్ణయించినట్టు సమాచారం. ఆయనకు బదులుగా కేంద్రమంత్రులు రాజ్‌ నాథ్‌ సింగ్‌ - అరుణ్‌ జైట్లీ - సుష్మా స్వరాజ్‌ - నితిన్‌ గడ్కరీతోపాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాలతో దశలవారీగా ప్రచారం నిర్వహించి, చివరి దశలో ప్రధానిని రంగంలోకి దించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

మ‌రోవైపు రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల విష‌యంలోనూ బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. దివంగత సుభాష్ చంద్రబోస్‌ కు సంబంధించిన కొన్ని రహస్య పత్రాలను ఆయన జన్మదినం రోజైన జనవరి 23న బహిరంగపరచడం ద్వారా నేతాజీ అభిమానులను తమవైపు తిప్పుకోవాలన్న ఆలోచన కూడా బీజేపీ నేతల్లో ఉంది. అయితే, ఇప్పటికే నేతాజీ స్వయంగా స్థాపించిన ఫార్వార్డ్‌ బ్లాక్‌ వెంట ఆయన అభిమానులున్నారన్న విషయం బెంగాల్‌ బీజేపీ నేతలకు తెలియందేమీకాదు. దీంతో, బీజేపీకి ఆ రాష్ట్రంలో ఆశించినన్ని ఫలితాలు దక్కకపోవచ్చని పరిశీలకుల విశ్లేషణ.ఏది ఏమైనా స్థానిక బీజేపీ నేతలు మాత్రం ఆ రాష్ట్రంలోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకూ పోటీ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News