కొత్తా నేతలండీ.. ఎవరెవరికి ఛాన్స్ ..!
వైసీపీలో జగన్‌ను పొగిడే వారు కొందరు.. జెండాలు పట్టుకుని క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసే వారు మరికొందరు.;
వైసీపీలో జగన్‌ను పొగిడే వారు కొందరు.. జెండాలు పట్టుకుని క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసే వారు మరికొందరు. ఇక, టీడీపీలోనూ ఇదే బాపతు నాయకులు చాలా మంది ఉన్నారు. సీఎం చంద్రబాబును.. మంత్రి నారా లోకేష్‌ను ఆకాశానికి ఎత్తేసి.. మీడియా ముందు.. వైసీపీని తిట్టేసి.. మైలేజీ కోసం ప్రయ త్నించేవారు చాలా మంది కనిపిస్తున్నారని.. ఇటీవల చంద్రబాబు సైతం.. ఆక్షేపించారు. పనిచేసే వారినే పార్టీ గుర్తిస్తుందన్నారు. ఇక, ఈ తరహా మందలింపు.. వైసీపీలో ఎక్కడా కనిపించడం లేదు.
సరే.. ఈవిషయం ఎలా ఉన్నా.. ఇప్పుడు దేశవ్యాప్తంగా 50 శాతం వరకు దాదాపు నియోజకవర్గాలు పెరగ నున్నాయి. మన రాష్ట్రంలో అయితే.. 88 అసెంబ్లీ, 12 పార్లమెంటుసీట్లు కూడా పెంచనున్నారన్న వార్తలు వచ్చాయి. దీనిపై కేంద్రం కూడా కసరత్తు చేస్తోంది. ఈ పరిణామాల క్రమంలో కొత్త నేతలు ఖచ్చితంగా పార్టీలకు అవసరమన్నది వాస్తవం. అయితే.. బాగా చదువుకున్న వారిని తీసుకుందామంటే..వారి సంఖ్య 1 శాతానికి మించడం లేదు.
పోనీ.. సాధారణంగా ఉన్న నాయకులను తీసుకోవాలంటే.. అటు వైసీపీలో అయినా.. ఇటు టీడీపీలో అయినా.. నాయకుల సంఖ్య ఉన్నప్పటికీ.. రాశి(సామర్థ్యం) ఎంత అనేది ప్రశ్నార్థకంగా మారింది. పొగడ్తలకు పడిపోయి.. రేపు నాయకులను చేస్తే.. ఇబ్బందులు తప్పవన్న వాదన వినిపిస్తోంది. అలాగని వారిని వదిలేసినా ప్రమాదమే. ఇక, క్షేత్రస్థాయిలో జెండా మోస్తున్నవారికి అవకాశం కల్పించాలని ఉన్నా.. ఎమ్మెల్యేల సిఫారసులు, ఎంపీల రికమండేషన్లు.. ఇలా చాలానే ఉన్నాయి.
మొత్తంగా చూస్తే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రాజకీయంగా కొత్తవారికి అవకాశం ఇవ్వాలంటే.. బలమైన నాయకులుగా ఎదిగిన వారికే ఇవ్వాలి. ఈ లెక్కన కొన్ని జిల్లాల్లో నాయకుల సంఖ్య ఎక్కువగా ఉంటే.. మరికొన్ని జిల్లాల్లో చాలా తక్కువగా ఉంది. ఈ పరిణామాల క్రమంలో పార్టీలకు కూడా నాయకుల ఎంపిక కత్తిమీద సాముగానే మారిందనిచెప్పాలి. అయితే.. మరో రెండేళ్ల వరకు సమయం ఉన్న క్రమంలో సుదీర్ఘంగా చర్చించేందుకు పార్టీలకు.. తమను తాము నిరూపించేందుకునేందుకు నాయకులకు కూడా అవకాశం ఉంటుంది.