ఏపీలో కొత్త నియోజకవర్గాలు ఇవేనా? జిల్లాల వారీగా లెక్కలు మారుతున్నాయా?
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా డీలిమిటేషన్ పైనే చర్చ ఎక్కువగా జరుగుతోంది.;
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా డీలిమిటేషన్ పైనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి రెండు రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెరగనున్నాయనే సమాచారం నేతల్లో సరికొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్ కూడా అమలు చేయనున్నారనే ప్రచారం కొందరిని ఆందోళనకు గురిచేస్తోంది. మహిళా మణులకు రిజర్వు అయ్యే స్థానాలతో తమ సీట్లు ఎక్కడ గల్లంతు అవుతాయోనని ఎమ్మెల్యేలు, ఎంపీలు టెన్షన్ పడుతున్నారు.
ఇక ఏపీ విషయానికి వస్తే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో రాజకీయం సమూలంగా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం స్థానాలు 263కి పెరగడం పక్కా అంటున్నారు. అయితే కొత్తగా ఏర్పడబోయే నియోజకవర్గాలు ఏవి? జిల్లాల వారీగా ఎన్నేసి స్థానాలు పెరుగుతాయి. నగరాల్లో పెరిగే స్థానాలు ఎన్ని? గ్రామీణ ప్రాంతంలో కొత్తగా ఆవిర్భవించనున్న అసెంబ్లీ స్థానాలు ఏవి అన్న చర్చే ఇప్పుడు హీట్ పుట్టిస్తోంది.
ఏపీలో ప్రస్తుతం 175 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిని పునర్విభజించి 263 స్థానాలు చేస్తామంటున్నారు. ఇక కొత్తగా ఏర్పడబోయే స్థానాలు సంఖ్యకు సమానంగా మహిళలకు అసెంబ్లీ స్థానాలను రిజర్వు చేస్తామని అంటున్నారు. దీంతో ఏయే నియోజకవర్గాలు మహిళలకు రిజర్వు చేస్తారు? జనాభా ప్రాతిపదికన మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తారా? లేక జిల్లాను యూనిట్ గా తీసుకుని రిజర్వేషన్లు ఉంటాయా? అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఇదేసమయంలో రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో అమలు చేస్తారా? లేక ఒకసారి ప్రకటించిన తర్వాత మళ్లీ డీలిమిటేషన్ వరకు అలాగే వదిలేస్తారా? అన్నది విస్తృత చర్చకు దారితీస్తోంది.
ఇక జనాభా ప్రాతిపదకనే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందన్న సమాచారంతో కొత్తగా ఏర్పడబోయే స్థానాలు ఏవి? అన్న చర్చ జరుగుతోంది. 2014లో రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీలో కొత్తగా 50 స్థానాలు మాత్రమే పెరుగుతాయని ఇన్నాళ్లు భావించారు. అయితే కేంద్రం ఇచ్చిన స్పెషల్ బొనంజాతో ఏకంగా 88 స్థానాలు పెరుగుతున్నాయి. దీంతో అన్ని పార్టీల్లో ఆశావహులు పండుగ చేసుకుంటున్నారు. కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు? వాటి పరిధిలో ఉండే మండలాలు, గ్రామాలుపై రకరకాల అంచనాలు వేసుకుంటున్నారు.
ప్రస్తుతం డీలిమిటేషన్ ప్రక్రియపై ప్రభుత్వం నిర్దిష్టమైన ఆదేశాలు ఏవీ ఇవ్వలేదు. కానీ, 2009లో జరిగిన పునర్విభజనను మరోసారి గుర్తుకు తెచ్చుకుని కొన్ని ప్రాంతాల్లో కొత్త నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలోని పెద్ద నగరాలైన విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ వంటి చోట్ల ఇప్పుడు ఉన్న స్థానాలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అదేవిధంగా కొన్ని జిల్లా కేంద్రాలు కూడా జనాభా పెరిగిపోవడంతో అర్బన్ నియోజకవర్గాలుగా ఆవిర్భవించే చాన్స్ ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉండగా, 28 జిల్లాలు ఉన్నాయి. వైసీపీ హయాంలో సగటున 7 నియోజకవర్గాలకు ఒక జిల్లా ఏర్పాటు చేశారు. అంటే ఒక్కో జిల్లా పరిధిలో ఏడేసి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కొన్ని జిల్లాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. కొన్ని చోట్ల ఆరు, మరికొన్నిచోట్ల 8 నియోజకవర్గాలు ఒక జిల్లాగా ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వంలో కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఈ జిల్లాల పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. మొత్తం 263 నియోజకవర్గాలు ఏర్పాటు అవుతుండటంతో ఒక్కో జిల్లాలో 9 లేదా 10 నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. నగర ప్రాంతాలు ఉండే జిల్లాలలో కొత్త నియోజకవర్గాల సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి కేంద్రం తాజా ప్రతిపాదనలు రాజకీయంగా విస్తృత చర్చకే దారితీస్తున్నాయి.