పెట్రోల్ ధరలపై కేంద్రం సంచలన ప్రకటన
మొత్తంగా దేశంలో ఇంధన ధరలు పెరగబోవని.. సరఫరాలో ఎటువంటి అంతరాయం ఉండదని ప్రభుత్వం హామీ ఇచ్చింది.;
గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరాపై సాగుతున్న ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం తెరదించింది. దేశంలో ఇంధన కొరత ఉందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు లేదా ఇతర భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, భారతదేశంలో ఇంధన భద్రతకు ఎలాంటి ఢోకా లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
రూమర్లను నమ్మవద్దు.. పానిక్ బయింగ్‌పై హెచ్చరిక
కేంద్ర పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ ఈ అంశంపై మీడియాతో మాట్లాడుతూ దేశంలో అవసరానికి మించి ఇంధన నిల్వలు ఉన్నాయని వివరించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం వల్ల కొన్ని ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనలకు గురై, పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారని ఆమె పేర్కొన్నారు. "దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయి. ప్రజలు అనవసరంగా భయపడి ఒకేసారి భారీగా ఇంధనం కొనుగోలు చేయవద్దు. ఇలా చేయడం వల్ల అనవసరమైన కృత్రిమ కొరత ఏర్పడి, సరఫరా వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడే అవకాశం ఉంది," అని అధికారులు హెచ్చరించారు.
ప్రస్తుతం దేశంలోని అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయని, దిగుమతులు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. అత్యవసర సమయాల కోసం ఏర్పాటు చేసిన వ్యూహాత్మక నిల్వలు కూడా సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది.
పీఎన్.జీ వినియోగంపై కఠిన నిర్ణయం: ఎల్.పీజీ వినియోగదారులకు గడువు
ఇంధన నిల్వలపై భరోసా ఇస్తూనే గ్యాస్ వినియోగం విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. నగరాల్లో వంట గ్యాస్ సరఫరాను మరింత క్రమబద్ధీకరించేందుకు పైప్డ్ నేచురల్ గ్యాస్ వాడకాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే మౌలిక సదుపాయాలు కల్పించి పీఎన్జీ సౌకర్యం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో కూడా చాలామంది వినియోగదారులు ఇంకా ఎల్.పీజీ సిలిండర్లనే వాడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనిపై కేంద్రం కఠిన వైఖరిని అవలంబించనుంది.ఈ కనెక్షన్ అందుబాటులో ఉన్నప్పటికీ తీసుకోని వారికి లేదా వాడుకలోకి మార్చుకోని వారికి 3 నెలల సమయం ఇవ్వబడుతుంది. ఈ గడువు ముగిసిన తర్వాత కూడా పీఎన్జీ కి మారకపోతే, సదరు వినియోగదారులకు అందే ఎల్పీజీ సరఫరాను శాశ్వతంగా నిలిపివేస్తారు. దీనివల్ల సిలిండర్ల రవాణా భారం తగ్గడమే కాకుండా పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుంది.
మొత్తంగా దేశంలో ఇంధన ధరలు పెరగబోవని.. సరఫరాలో ఎటువంటి అంతరాయం ఉండదని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి.. అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని కోరింది. అదే సమయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా స్వచ్ఛమైన, సురక్షితమైన పీఎన్జీ ఇంధనం వైపు ప్రజలు మళ్లాలని కేంద్రం సూచిస్తోంది.