నారాయణ.. చైతన్యలాంటోళ్లకు దిమ్మ తిరిగిపోద్దా?

Update: 2020-07-30 07:50 GMT
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నోటి నుంచి తరచూ ఒక ఆవేదన వ్యక్తమయ్యేది. దేశంలోని ఇన్ని విద్యా సంస్థలు ఉన్నప్పటికీ.. ఏదీ కూడా ప్రపంచ స్థాయిలో లేదన్న మాటతో పాటు.. అప్పుడెప్పుడో వందల ఏళ్ల క్రితమే ప్రపంచంలో అత్యంత ప్రముఖ విశ్వవిద్యాలయాలు భారత్ లోనే ఉండేవని చెప్పేవారు. భారత్ లో విద్యా వ్యవస్థను మార్చాలన్న మాట వినిపించేది. ఆయనే కాదు.. చాలామంది ప్రముఖుల నోటి నుంచి రావటం తెలిసిందే. అవన్నీ మైకుల్లో మాట్లాడేందుకే పరిమితమయ్యేవే కానీ.. ఆచరణలోకి తీసుకొచ్చేంత ధైర్యం చేసేవి కాదు.

అందుకు భిన్నంగా దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత ఇప్పుడున్న విద్యా వ్యవస్థను సమూల మార్పులు జరిగేలా కేంద్ర కాబినెట్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఒకేలాంటి విద్యా విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. అంతేనా.. ఇప్పటివరకూ హెచ్ ఆర్ డీ మినిస్ట్రీని సింఫుల్ గా అందరికి అర్థమయ్యేలా విద్యాశాఖగా పేరు మార్చేశారు. ఈ మార్పు ఒక్కటి చాలు.. అసలేం జరుగుతుందన్నది చెప్పటానికి.

ఇప్పటివరకూ ఐదేళ్లకు కానీ స్కూల్లో చేర్చుకోని పరిస్థితి నుంచి ఇకపై మూడేళ్ల నుంచే స్కూలుకు వెళ్లే అవకాశం ఉండనుంది. అంతేనా? టెన్త్.. ఆ తర్వాత ఇంటర్.. ఆ వెంటనే పోటీ పరీక్షలు.. ఇంజనీరింగ్ లాంటి రొడ్డుకొట్టుకు విధానానికి బ్రేకులు వేయనున్నారు. ఆరోతరగతి నుంచే ఏదో ఒక ప్రొఫెషనల్ కోర్సు అందుబాటులోకి వచ్చేలా మార్చేశారు.

ఇంతకాలం సిలబస్.. మార్కులు లాంటి వాటితో స్కూళ్లను అత్యద్భుతమైన వ్యాపారంగా మార్చేసిన విద్యా సంస్థలకు రానున్న రోజుల్లో చుక్కలనే చెప్పాలి. ఇంగ్లిషు.. తెలుగు.. మ్యాథ్స్.. సైన్స్.. సోషల్ పాఠాల్ని బోధించటం.. మార్కులు వచ్చే ఫార్ములాలను సిద్ధం చేయటం.. అదే పనిగా బట్టీ పట్టించటంతో పాటు మార్కుల్ని తీసుకురావటమే లక్ష్యమన్నట్లుగా ఉండేది.

విద్యా సంస్థలు మార్కుల్ని ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా ఉండేవి తప్పించి మరేమీ ఉండేది కాదు. వ్యక్తిత్వ వికాసం.. మానసిక పరిపక్వత.. లాజికల్ థింకింగ్ లాంటి వాటికి అస్సలు ప్రాధాన్యత ఇవ్వని పరిస్థితి. ఎంతసేపు.. మార్కులు.. ర్యాంకులు తప్పించి ప్రొఫెషనల్ గా తయారు కాని పరిస్థితి. దీంతో..బతకటానికి అవసరమైన నైపుణ్యాలు చాలామందిలో లేని పరిస్థితి.

అన్నింటికి మించి చదువులు అయ్యాక కొలువుల కోసం ప్రయత్నిస్తే.. అప్పటివరకూ తాము చదివిన చదువుకు.. చేసే పనికి ఏ మాత్రం సంబంధం లేనట్లుగా ఉండేవి. అసలు ఇంతకాలం ఎందుకు చదివామని ఫీలయ్యేటోళ్లు చాలామందే కనిపిస్తారు. తాజాగా మోడీ సర్కారు తీసుకొస్తున్న కొత్త విధానం విద్యార్థులకే కాదు.. విద్యా సంస్థలకు.. కార్పొరేట్ స్కూళ్లకు పెను ఉత్పాతంగా మారుతుందని చెప్పక తప్పదు.

కొత్త విధానంలోకి మారటం అంత తేలికైన విషయం కాదు. అందుకోసం తమను తాము మార్చుకోవాల్సిన అవసరం చాలానే ఉంటుంది. ఏమైనా.. ఇప్పటిమాదిరి పదో తరగతి అన్నంతనే భారీ హడావుడి.. ఇంటర్ కు చెప్పలేనంత కోలాహలం.. ఆ తర్వాత జరిగే ఎంసెట్.. జేఎఎఈ.. లాంటి పోటీ పరీక్షలు లాంటివి భవిష్యత్తులో కష్టమే. కొత్త ఫార్మాట్లు రానున్న నేపథ్యంలో నారాయణ.. చైతన్యలాంటి కార్పొరేట్లకు కొత్త కష్టాలు ఖాయమన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News