పీఆర్సీ పై కోర్టులో కేసు... సర్కారుకు ఛాన్స్

Update: 2022-01-21 04:28 GMT
పీఆర్సీ అమలుపై గెజిటెడ్ అధికారుల సంఘం కోర్టులో కేసు వేసింది. పీఆర్సీ అమలులో తమకు ప్రభుత్వం అన్యాయం చేసింది కాబట్టి తమకు జరిగిన అన్యాయాన్ని సరిచేయాలంటు గెజిటెడ్ అధికారుల సంఘం హైకోర్టులో కేసు వేసింది. ఈ కేసులో ప్రధానంగా తగ్గించిన ఇంటి అద్దె బత్యాన్నే ప్రస్తావించింది. తమకు ఇపుడొస్తున్న 30 శాతం హెచ్ఆర్ఏని ప్రభుత్వం ఏ విధంగా తగ్గించింది, దానివల్ల తమకు జరగబోయే ఆర్ధికనష్టం ఎంతనే విషయాన్ని వివరించింది.

గెజిటెడ్ అధికారుల సంఘం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేయటంలో తప్పులేదు. ఒకవైపు ఉద్యోగుల సంఘాల నేతలు ప్రభుత్వంతో చర్చలకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికి రెండుసార్లు చర్చించారు. అటు ప్రభుత్వం ఇటు ఉద్యోగ నేతలు ఎవరి వాదనకు వాళ్ళు కట్టుబడున్నారు. గురువారం నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, టీచర్లు ఆందోళనలకు రోడ్డెక్కారు. శుక్రవారం అంటే ఈరోజు అన్నీ ఉద్యోగసంఘాల నేతలు సమావేశమై పరిస్ధితిని సమీక్షించనున్నారు.

శుక్రవారం సమావేశంలో కార్యాచరణను ప్రకటించేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో మంత్రులు కూడా ఉద్యోగనేతలను చర్చలకు ఆహ్వానించారు. ఇపుడు మొదలైన పీఆర్సీ వివాదం కేవలం చర్చల ద్వారా మాత్రమే పరిష్కారమవుతుంది. అంతేకానీ రెండువైపులా నువ్వెంతంటే నువ్వెంత అనుకుంటే సమస్య పెరుగుతుందే కానీ తగ్గదు. ఇలాంటి పరిస్థితుల్లో గెజిటెడ్ అధికారుల సంఘం కోర్టులో కేసు వేసింది. దీని వల్ల సమస్య పరిష్కారం అయ్యేందుకు మరింత కాలం పడుతుందే కానీ తగ్గదు.
Read more!

ప్రభుత్వం ఏమి చేస్తుందంటే కోర్టులో పిటీషన్ వేశారు కాబట్టి దాని సంగతి ముందు తేల్చమంటుంది. కింద కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పొస్తే పై కోర్టుకెళుతుంది. అంటే సమస్య చర్చల దశను దాటి కోర్టుకెక్కింది కాబట్టి పరిష్కారం కూడా కోర్టులోనే తేల్చుకుందామంటుంది ప్రభుత్వం. కోర్టుల్లో కేసులంటే ఒక పట్టాన తెగదన్న విషయం గెజిటెడ్ అధికారులకు తెలీదా ? ఎవరికి అనుకూలంగా తీర్పొచ్చినా రెండోవాళ్ళు కచ్చితంగా పై కోర్టుకు వెళతారనటంలో సందేహంలేదు. దీంతో అనవసరంగా గెజిటెడ్ అధికారులు సమస్యను మరింతగా సాగదీయడమే తప్ప మరేమీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.
Tags:    

Similar News