కొత్త డాక్టరమ్మలు... ఎంబీబీఎస్ లో అమ్మాయిల హవా

ఇక ప్రస్తుతం విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ లో 60.72 శాతం అమ్మాయిలే ప్రవేశాలు పొందారు.;

Update: 2025-12-06 22:30 GMT

అమ్మాయిలు అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారు ఎన్నుకున్న రంగాలలో పట్టుబట్టి మరీ రాణిస్తున్నారు. ఇక ఏ ఏటికి ఆ ఏడు వైద్య విద్యలో కూడా అమ్మాయిలు సత్తా చాటుకుంటున్నారు. తాజాగా చూస్తే 2025-26 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ ప్రవేశాలలో అమ్మాయిలు అదరగొట్టేశారు.గడిచిన రెండేళ్ల తో పోల్చితే 2025-26 ప్రవేశాల్లో 3.66 శాతం అమ్మాయిలు అధికంగా పొందారు అని అంటున్నారు. ఇక కన్వీనర్ యాజమాన్య కోటా సీట్లలోనూ వీరిదే హవాగా ఉంది.

ఇది ఒక రికార్డు :

ఇక ప్రస్తుతం విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ లో 60.72 శాతం అమ్మాయిలే ప్రవేశాలు పొందారు. గత రెండేళ్లతో పోల్చితే 2025-26 విద్యా సంవత్సరంలో 3.66 శాతం అమ్మాయిల ప్రవేశాలు పెరిగాయని అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆద్వర్యంలో ఈ విద్యా సంవత్సరానికి సంబందించిన ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ ప్రవేశాలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. తాజా అడ్మిన్షన్లతో అమ్మాయిలు సూపర్ అనిపీంచుకున్నారు.

మూడేళ్ళలో అధికం :

ఇక చూస్తే వరుసగా 2023-24లో 57.06 శాతం, 2024-25లో 57.96 శాతం, 2025-26లో 60.72 శాతం వంతున చూస్తే అమ్మాయిలు ఎంబీబీఎస్ లో ప్రతీ ఏటా తమ వాటా పెంచుకుంటున్నారు అని అంటున్నారు. ఈ పరిణామం పట్ల అమ్మాయిల భవిష్యత్తు విషయంలో తల్లిదండ్రులలో వస్తున్న గణనీయమైన మార్పునకు సంకేతమని పలువురు అంటున్నారు. ఇక అమ్మాయిలు చిన్ననాటి నుంచే డాక్టర్ కావాలని ఒక టార్గెట్ పెట్టుకుని ఆ దిశగా పట్టుదలగా అడుగులు వేస్తున్నారు అలా పాఠశాల విద్య నుంచే అమ్మాయిలు నీట్ లో ఉత్తమ ర్యాంకు సాదించేందుకు పుస్తకాలతో సావాసం చేస్తున్నరు అని చెబుతున్నారు. ఈ కారణంగానే వారికి నీట్ లో మంచి ర్యాంకుల వస్తున్నాయని చెబుతున్నారు. ఇక ఎంబీబీస్ లో మెజారిటీ సీట్లు అమ్మాయిలు దక్కించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే 2024-25తో పోల్చితే అబ్బాయిల ప్రవేశాలు 3.66 శాతం ఈసారి తగ్గాయని గుర్తు చేస్తున్నారు.

యాజమాన్య కోటాలోనూ :

ఇక కన్వీనర్ కోటాలోనే కాకుండా యాజమాన్య కోటాలోనూ అమ్మాయిల ప్రవేశాలే ఈసారి అధికంగా ఉండడం గమనార్హం. 2025-26 విద్యా సంవత్సరంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 6,430 ఉన్నాయి. ఇందులో కన్వీనర్ కోటా కింద అమ్మాయిలు 2,617, అబ్బాయిలు 1,638 వంతున సీట్లు దక్కించుకున్నారు. ఇదేవిధంగా యాజమాన్య కోటాలో అమ్మాయిలు 1,287, అబ్బాయిలు 888 మంది చొప్పున ప్రవేశాలు పొందారని విశ్వవిద్యాలయం అధికారులు వివరించారు. దీని ప్రకారం కన్వీనర్ కోటాలో 61.50 శాతం, మేనేజ్మెంటు కోటాలో 59.17 శాతం వంతున అమ్మాయిలు సీట్లు దక్కించుకుని సరికొత్త రికార్డుని సాధించారు. ఇది ఏపీకి ఒక మంచి సంకేతంగా చెబుతున్నారు. ఎక్కువ మంది మహిళా డాక్టర్లు ఉంటే ఆరోగ్యం రంగం ఇంకా బాగుంటుందని అంటున్నారు.

Tags:    

Similar News