లోకేష్ పై కేసు..నిలుస్తుందా ?

Update: 2021-06-20 09:52 GMT
ప్రతిపక్ష నేతలపై పోలీసులు పెడుతున్న కొన్ని కేసులు న్యాయసమీక్షకు నిలుస్తుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష నేతలపై అధికార వైసీపీ కక్షసాధింపులకు పాల్పడుతోందనే ఆరోపణలు విపరీతంగా పెరిగిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. సరే అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రత్యర్ధులపై దాదాపు చేసేదిదే అనటంలో సందేహంలేదు. ఎందుకంటే టీడీపీ అధికారంలో ఉన్నపుడు కూడా చాలామంది వైసీపీ నేతలపై ఎన్నో కేసులు పెట్టి అరెస్టులు చేయించింది.

ఇప్పుడు విషయం ఏమిటంటే నారా లోకేష్ పై కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసు పెట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోయిన సంవత్సరం ఇఎస్ఐ కుంభకోణంలో మాజీమంత్రి అచ్చెన్నాయుడును అరెస్టు చేసి తర్వాత కోర్టులో హాజరుపరిచారు. ఆ సందర్భంగా అచ్చెన్నతో మాట్లాడేందుకు లోకేష్, దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర తదితరులు కోర్టు దగ్గరకు వచ్చారట. ఆ సందర్భంగా వాళ్ళంతా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి గుంపులుగా ఉన్నారట.

ఇదే విషయమై లోకేష్ అండ్ కో పై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఇఫుడు బయటపడింది. సరే కేసు విషయాన్ని పక్కనపెట్టేస్తే గుంపులుగా గుమిగూడటమన్నది అధికారపార్టీ నేతలు కూడా చేస్తున్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికలు, తిరుపతి లోక్ సభ బై ఎలక్షన్ల సమయంలో ఇటు టీడీపీ, అటు వైసీపీ నేతలు గుంపులుగానే ప్రచారంలో పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే.

ఇదే కాకుండా సంక్షేమ పథకాల అమలు విషయంలో కూడా మంత్రులు, వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు గుంపులుగానే హాజరవుతున్నారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని టీడీపీ నేతలపై పెడుతున్న కేసులను మంత్రులు, వైసీపీ నేతలపైన కూడా పెట్టాలి. అలాకాకుండా కేవలం టీడీపీ నేతలపైన పెడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రతిపక్షాలపై ప్రభుత్వం పెడుతున్న ఇలాంటి కేసులు న్యాయసమీక్షకు నిలబడదనే అనుకోవాల్సుంటుంది. రెండు వైపులా పోలీసులు కేసులు పెడుతుంటే కోర్టు కూడా ఆక్షేపించేందుకు ఏమీ ఉండదు.
Tags:    

Similar News