బంగారం గోవిందా.. టీటీడీలో వెలుగులోకి మరో కుంభకోణం?
తిరుమల శ్రీవారి ఆలయంలో చోటుచేసుకున్న ఉదంతాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.;
తిరుమల శ్రీవారి ఆలయంలో చోటుచేసుకున్న ఉదంతాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పటికే శ్రీవారి పరకామణిలో చోరీ, పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే అంశాలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. గత కొన్నినెలలుగా రాజకీయం కూడా ఈ రెండు అంశాల చుట్టూనే తిరుగుతోంది. దీనికి కొనసాగింపు అన్నట్లు తాజాగా 50 కిలోల బంగారం మాయం చేశారన్న మరో వివాదం తెరపైకి వచ్చినట్లు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి ఆలయ గోపురానికి బంగారు తాపడం చేయించారని, ఆ సమయంలో 50 కిలోల బంగారం మాయం చేశారన్న ఆరోపణలపై టీటీడీ విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గోవిందరాజస్వామి ఆలయ తాపడానికి వాడాల్సిన బంగారంలో 50 కిలోలు మాయం చేశారన్న ప్రచారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై కొన్ని పత్రికలు కథనాలు ప్రచురించాయి. దీంతో మీడియాలో కూడా ఇదే విషయంపై విస్తృత చర్చ జరుగుతోంది. తిరుపతిలో శ్రీగోవింద రాజస్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. 2022-23లో ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయడానికి టీటీడీ ద్వారా సుమారు 100 కిలోల బంగారం కేటాయించినట్లు చెబుతున్నారు. మొత్తం 9 పొరలతో తాపడం చేయాల్సివుండగా, కేవలం రెండు పొరలతో సరిపెట్టి దాదాపు సగం బంగారాన్ని మాయం చేశారని ఆరోపిస్తున్నారు.
అంతేకాకుండా ఆలయ విమాన గోపురంపై 30 విగ్రహాలు కూడా ధ్వంసం చేశారని ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై గతంలోనే పెద్ద వివాదం రేగిందని అంటున్నారు. అయితే అప్పటి టీటీడీ పెద్దలు ఈ వ్యవహారం బయటకు రాకుండా సర్దుమణిగించారని చెబుతున్నారు. ఇక విమాన గోపురం పనులను కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ కాకుండా సబ్ లీజుకు మరో సంస్థకు ఇచ్చారని అంటున్నారు. బంగారం మాయం అవ్వడానికి ఇదే కారణమా? అన్న కోణంలో విజిలెన్స్ విచారణ జరుపుతున్నట్లు చెబుతున్నారు.
దాదాపు 50 కిలోల బంగారం మాయమైందనే ప్రచారం విస్తృతంగా జరగుతుండటంతో టీటీడీ కేంద్రంగా మరో రాజకీయ వివాదం రేగే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. ప్రస్తుతం కొందరు భక్తుల ఫిర్యాదుపై టీటీడీ విజిలెన్స్ అంతర్గతంగా విచారణ జరుపుతోందని చెబుతున్నారు. అప్పట్లో బంగారు తాపడం పనులు చేసిన కార్మికులను ప్రశ్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. దీనిపై ఇప్పటివరకు టీటీడీ నుంచి పోలీసులకు ఎటువంటి ఫిర్యాదులు వెళ్లలేదు. దీంతో బంగారం దారిమళ్లడం కేవలం ఆరోపణలేనా? నిజంగా జరిగిందా? అనేది కూడా చర్చగా మారింది. ప్రస్తుత ధరల ప్రకారం దాదాపు రూ.70 కోట్ల విలువైన బంగారం మాయమైనట్లు ఆరోపణలు వస్తుంటే ప్రభుత్వం, పాలకవర్గం ఏం చేస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.