కారు.. పదహారు మీద పంచ్ లు పేలుతున్నాయిగా?

Update: 2020-11-29 09:50 GMT
తెలంగాణ రాష్ట్ర సమితి.. సింఫుల్ గా చెప్పాలంటే టీఆర్ఎస్. ఈ పార్టీ పెట్టిన నాటి నుంచి ఏ కార్యక్రమాన్ని చేపట్టినా.. ఏ నినాదాన్ని వినిపించినా.. అందరిని ఆకర్షించేది. అందరూ దాని గురించి మాట్లాడుకునే వారు. మొత్తంగా లాభమే కానీ నష్టం జరిగిన దాఖలాలు కనిపించవు.అలాంటి టీఆర్ఎస్ కు మర్చిపోలేని చేదు అనుభవాన్ని మిగిల్చిన నినాదం ఏదైనా ఉందంటే.. సారు..కారు.. పదహారు అంటూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో కల్వకుంట్ల కుటుంబసభ్యుల నోటి నుంచి పదే పదే వినిపించింది.

తెలంగాణ బిడ్డను ఢిల్లీకి పంపేందుకు ఆ మాత్రం సీట్లు కావాలన్న మాట చెప్పేవారు. తెలంగాణలో ఉన్న లోక్ సభ సీట్లు పదహారేనా? అంటే.. కాదు పదిహేడు అని చెబుతారు. మరి.. పదహారు చాలని ఎందుకు చెప్పినట్లు? అన్న ప్రశ్నకు.. మిత్రుడు మజ్లిస్ కోసం ఆ మాత్రం వదిలిపెట్టకుండా ఉండలేరు కదా అనే మాట పలువురి నోట వినిపించేది. ఇప్పుడా మాటలే టీఆర్ఎస్ కు శాపంగా మారుతున్నాయి. మజ్లిస్ మిత్రుడు కాదంటారు. అలాంటప్పుడు లోక్ సభ ఎన్నికల వేళ పదహారు మాట ఎందుకు వచ్చింది? పదిహేడు ఎందుకు రాలేదు? అన్న ప్రశ్నతో పాటు.. మజ్లిస్ తో రహస్య ఒప్పందం చేసుకొని ప్రజల్ని కేసీఆర్ మోసం చేస్తున్నారన్న మాట బీజేపీ నేతలు చెబుతున్నారు.

కారు..సారు.. పదహారు అంటూ రిథమిక్ నినాదం రిజల్ట్ చేదుగా మారటమే కాదు.. ఆ మాటల్ని మరోసారి గుర్తు చేసుకోవటానికి గులాబీ అధినాయకత్వం సిద్ధంగా లేదు. అయినప్పటికి విపక్షాలు మాత్రం పదే పదే పదహారు మాటను ప్రస్తావిస్తూ తెలంగాణ అధికారపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో.. వారు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నట్లు చెబుతున్నారు. కొన్ని మాటలు అంతే.. మొదలు పెట్టేటప్పుడు బాగానే ఉన్నా.. తర్వాత కాలంలో ఆ మాటలు చేదుమాత్రలుగా మారిపోతుంటాయి.
Tags:    

Similar News