'రుషికొండ'పై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక సూచనలు.. కూటమిలో బిగ్ ట్విస్టు
రుషికొండను ఆదాయ వనరుగా ప్రభుత్వం చూడకూడదని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడుతున్నారు.;
రుషికొండపై గత ప్రభుత్వం నిర్మించిన భవనాల వినియోగంపై కూటమి ప్రభుత్వంలో తర్జనభర్జన కొనసాగుతోంది. పర్యాటక శాఖ పరిధిలో ఉన్న ఈ భవనాలను ఆతిథ్య రంగానికి అప్పగించాలని కూటమి ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందని కథనాలు వస్తున్నాయి. ఈ నెల 28న దీనిపై తుది నిర్ణయం తీసుకోనుందని అంటున్నారు. ఇలాంటి సమయంలో కూటమికి చెందిన బీజేపీ శాసనసభాపక్ష నేత, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారు. రుషికొండపై నాలుగు భవనాలను స్టార్ హోటళ్లకు అప్పగించే విషయమై ప్రభుత్వం నిర్ణయం వెలువడటానికి రెండు రోజుల ముందు మిత్రపక్షం నుంచి వచ్చిన కొత్త ప్రతిపాదనతో వ్యవహారం మళ్లీ మొదటికి వస్తుందా? అనే అనుమానం తలెత్తుతోందని అంటున్నారు.
రుషికొండ భవనాలను ఆతిథ్య రంగానికి అప్పగించాలని మంత్రుల కమిటీ నిర్ణయించిందని, ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని రెండు రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ అభిప్రాయాన్ని మంత్రుల కమిటీ తీసుకోలేదని అభ్యంతరం వ్యక్తం చేశారని చెబుతున్నారు. విశాఖ ప్రజల నుంచి కూడా సలహాలు స్వీకరించాలని ఆయన సూచించారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన తన ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చారు. రుషికొండ భవనాలతోపాటు చుట్టుపక్కల కొండ భూమిని తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించాలని విష్ణు సూచించారు.
రుషికొండను ఆదాయ వనరుగా ప్రభుత్వం చూడకూడదని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడుతున్నారు. కొండపై నిర్మించిన నాలుగు విలాసవంతమైన భవనాలను హోటళ్లకు అప్పగిస్తే సామాన్యులకు దూరం అవుతుందని అంటున్నారు. టీటీడీకి అప్పగించి ఆధ్యాత్మిక నగరంగా అభివృద్ధి చేయడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అంటున్నారు. దీంతో రుషికొండపై మరోమారు హాట్ డిబేట్ జరుగుతోంది. నిజానికి రుషికొండపై గతంలో ఏపీ ప్రభుత్వానికి చెందిన పున్నమి రిసార్ట్స్ ఉండేవి. వీటి ద్వారా ఏడాదికి సుమారు రూ.8 కోట్ల మేర పర్యాటక శాఖకు ఆదాయం సమకూరేదని చెబుతున్నారు.
గత ప్రభుత్వంలో పున్నమి రిసార్ట్స్ ను తొలగించి, నాలుగు విలాస వంతమైన భవనాలను నిర్మించారు. అప్పట్లో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది. పర్యావరణ వేత్తలు సుప్రీంకోర్టులో కేసులు కూడా వేశారు. దీంతో అత్యంత రహస్యంగా రుషికొండపై నాలుగు విలాసవంతమైన భవనాలను నిర్మించారని చెబుతున్నారు. అప్పట్లో సీఎం క్యాంపు కార్యాలయం కోసమే ఈ భవనాలను నిర్మించినట్లు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు విమర్శించేవారు. వైసీపీ ప్రభుత్వం విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని భావించడం, సీఎం క్యాంపు కార్యాలయం కోసం రుషికొండపై అత్యాధునిక, విలాసవంతమైన సౌకర్యాలతో భవనాలను నిర్మించడంపై పెద్ద వివాదమే కొనసాగింది. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిన్నరగా ఈ భవనాలను ఏం చేయాలన్న దానిపైనే చర్చలు కొనసాగుతున్నాయి. ఎట్టకేలకు ఆతిథ్య రంగానికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా.. బీజేపీ ఎమ్మెల్యే విష్ణు వ్యాఖ్యలతో భవనాలపై తుది నిర్ణయం తీసుకోవడం మరింత జాప్యమయ్యేలా ఉందని అంటున్నారు.