హైదరాబాద్ అసలు పేరేంటో తెలుసా?

Update: 2018-01-21 10:12 GMT
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని.. దేశంలోనే ప్రముఖ నగరాల్లో ఒకటైన హైదరాబాద్ అసలు పేరేంటి అనగానే అందరికీ ‘భాగ్యనగరం’ గుర్తుకొస్తుంది. ఈ పేరు వెనుక ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. కులీకుతుబ్‌ షా-భాగమతిల ప్రణయ కావ్యానికి ఈ నగరం చిహ్నమని.. భాగమతి పేరు మీదే ఈ నగరానికి ‘భాగ్యనగరం’ అని పేరు పెట్టారన్నదే ఆ కథ. ఐతే ఇదంతా ఉత్త ప్రచారమే అంటున్నారు చారిత్రక పరిశోధకుడు కెప్టెన్‌ లింగాల పాండురంగారెడ్డి. కులీ కుతుబ్ షాకు.. భాగమతిల ప్రణయానికి అవకాశమే లేదని.. ఇద్దరి మధ్య వయసు తేడా అంత ఉందని అన్నారాయన. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో రెండు రోజులపాటు జరిగిన అంతర్జాతీయ హెరిటేజ్‌ సదస్సులో పాండురంగారెడ్డి తన పరిశోధన వ్యాసాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

హైదరాబాద్ అసలు పేరు చిచులం అని పాండురంగారెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరం వెలియకముందే మూసీ నదికి దక్షిణాన చిచులం పేరుతో ఓ పెద్ద గ్రామం ఉండేదని.. ఐతే గోల్కొండ నగరంలో జనాభా పెరిగిపోవడం.. ఇంతలో ప్లేగువ్యాధి ప్రబలటంతో జనం దాన్ని ఖాళీ చేసి బయట తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని.. అక్కడే తోటలూ పెంచుకున్నారని ఆయన తెలిపారు. కొన్నేళ్ల తర్వాత ఈ ప్రాంతాల్ని ఖాళీ చేసి కోట లోపలికి చేరారని... ఆ తాత్కాలిక ఇళ్లను ప్రజలు ఆక్రమించుకున్నారని.. తర్వాత అవి కాలనీలుగా వెలిశాయని తెలిపారు. చార్మినార్‌ కట్టడాన్ని తీర్చిదిద్దిన ఆర్కిటెక్ట్‌ మీర్‌ ముమిన్‌ కూడా ఈ చిచులంలోనే నివసించారని.. అక్కడే చనిపోయారని.. ఆయన సమాధి అక్కడే ఉందని వెల్లడించారు. ఈ చిచులం తర్వాత తర్వాత బాగా విస్తరించి నగరంగా మారిందని.. ఆపై హైదర్‌ అలీకి గుర్తుగా దీని పేరును హైదరాబాద్‌ గా మార్చారని ఆయన తెలిపారు. ఈ నగరానికి భాగ్యనగరం అనే పేరు రావడానికి కారణం చెబుతూ.. ఫ్రెంచ్‌ వజ్రాల వ్యాపారి టావర్నియర్‌ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న తోటల్ని చూసి దీన్ని బాగ్ (తోట)ల నగరిగా పేర్కొన్నారని.. అలా ఇది భాగ్యనగరం అయిందని పాండురంగారెడ్డి అన్నారు.
Tags:    

Similar News