అమెరికాలోని మీడియా హౌస్ మీద కాల్పులు

Update: 2018-06-29 06:09 GMT
అమెరికా ప్ర‌జ‌లు ఉలిక్కిప‌డే ఘ‌ట‌న ఒక‌టి తాజాగా చోటు చేసుకుంది. మేరీ ల్యాండ్ లోని అన్నాపోలీస్ లోని క్యాపిట‌ల్ గెజిట్ వార్తాప‌త్రిక ఆఫీసుపై గుర్తు తెలియ‌ని దుండ‌గులు విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపారు.  అమెరికా స్థానిక కాల‌మానం ప్ర‌కారం గురువారం సాయ‌త్రం 2.35 గంట‌ల స‌మ‌యంలో ఈ దారుణ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు చెబుతున్నారు.

వెస్ట్ ఫీల్డ్ అన్నా పోలీస్ మాల్ స‌మీపంలోని బెస్ట్ గేట్ రోడ్డులో ఉన్న క్యాపిట‌ల్ గెజిట్ మీడియా హౌస్  కార్యాల‌యం ఉంది. నాలుగు అంత‌స్తులున్నీ భ‌వ‌నం గ్లాస్ డోర్ నుంచి దుండ‌గుడు కాల్పులు జ‌రిపారు. ఊహించ‌ని రీతిలో చోటు చేసుకున్న ఈ ప‌రిణామంతో ప‌త్రికాఫీసులోని సిబ్బంది తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

విచ‌క్ష‌ణార‌హితంగా సాగుతున్న కాల్పుల నేప‌థ్యంలో ప‌లువురు ఉద్యోగులు బ‌ల్ల‌ల కింద దాక్కున్నారు. ప్రాణాలు కాపాడుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ కాల్పుల ఘ‌ట‌న‌లో ఐదుగురు మ‌ర‌ణించగా.. ప‌లువురు తీవ్ర గాయాల‌పాలైన‌ట్లుగా చెబుతున్నారు. కాల్పులు జ‌రిపిన వ్య‌క్తి ఘ‌ట‌నాస్థ‌లానికి స‌మీపంలోని ఒక భ‌వ‌నంలో దాక్కున్న‌ట్లు గుర్తించారు.

కాల్పుల ఉదంతంలో ఒక్క‌సారి అలెర్ట్ అయిన పోలీసులు.. ప‌త్రికా కార్యాల‌యంలోని ప‌రిస‌రాల్ని యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ఖాళీ చేసి.. త‌నిఖీలు చేప‌ట్టారు. కాల్పుల‌కు కార‌ణ‌మైన ఒక అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. ఈ దారుణ ఉదంతంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు స‌మాచారం అందించిన‌ట్లు తెలుస్తోంది.  ఈ ఘ‌ట‌న అమెరిక‌న్ల‌కు షాకింగ్ గా మారింది.
Tags:    

Similar News