అవినీతిలో నరహరి నయా రికార్డులు.. లాకర్లలో కోట్ల కొద్ది నోట్ల గుట్టలు!
తెలంగాణ ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి అవినీతిపై నమోదైన కేసులో ఏసీబీ అధికారులు కీలక సమాచారం సేకరించారు.
తెలంగాణ ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి అవినీతిపై నమోదైన కేసులో ఏసీబీ అధికారులు కీలక సమాచారం సేకరించారు. ఇప్పటికే ఆయన ఇంట్లో తనఖీలు చేసిన ఏసీబీ అధికారులు కోట్ల రూపాయల నగదు గుర్తించారు. తాజాగా ఆయన బ్యాంకు లాకర్ ను తెరిచిన అధికారులు అందులో రూ.కోటిన్నర నగదు, 2.5 కిలోల బంగారం చూసి షాక్ తిన్నారు. అంతేకాకుండా నరహరి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న అకౌంట్లలో రూ.5 కోట్ల నగదును సీజ్ చేశారు. మొత్తానికి నరహరి అవినీతి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఏసీబీ చరిత్రలోనే ఈ కేసు ఒక రికార్డుగా మిగిలిపోతుందని అంటున్నారు.
తెలంగాణ ల్యాండ్స్ అండ్ సర్వే విభాగంలో మల్టీ జోన్-2 డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసిన సుంకరి నరహరి రావు అవినీతి వ్యవహారంపై విస్తృత చర్చ జరుగుతోంది. 1987లో నెలకు కేవలం రూ.700 జీతంతో చైన్‌మెన్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన నరహరి, ఆ తర్వాత సర్వే ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో వరుస ప్రమోషన్లు పొంది డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. అయితే, ప్రభుత్వ సర్వీసులో ఉన్నత పదవిని అడ్డుపెట్టుకుని, తన పరిధిలోని సిబ్బందితో కలిసి ల్యాండ్ రికార్డుల పేరుతో భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది.
ఈ వ్యవహారంపై రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని సుమారు 12 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి నరహరి అక్రమ సామ్రాజ్యాన్ని బయటపెట్టారు. ఛత్రినాకలోని ఆయన నివాసంలో జరిపిన సోదాల్లో కప్ బోర్డుల నిండా దాచిపెట్టిన రూ.1.54 కోట్ల నగదు, సుమారు 1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమికంగా రూ.13.05 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినప్పటికీ, ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఆయన కూడగట్టిన అక్రమార్జన రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కేవలం నగదు, బంగారం మాత్రమే కాకుండా, నరహరి భారీ స్థాయిలో స్థిరాస్తులను కూడా కూడగట్టినట్లు దర్యాప్తులో తేలింది. ఆయన కుటుంబ సభ్యుల పేరిట రూ.5.05 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, వివిధ బ్యాంకుల్లో రూ.2.29 కోట్ల నిల్వలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, రంగారెడ్డి జిల్లాలో 5 ఓపెన్ ప్లాట్లు, మహేశ్వరంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి, నార్సింగి, పుప్పాలగూడ, రాజేంద్రనగర్ వంటి ప్రాంతాల్లో ఖరీదైన ఫ్లాట్లు, గచ్చిబౌలి, ఛత్రినాకలో భారీ భవనాలు ఉన్నట్లు ఏసీబీ నివేదిక పేర్కొంది.
ఈ భారీ అవినీతి ఉదంతంలో ఏసీబీ అధికారులు సుంకరి నరహరిని అరెస్ట్ చేసి, నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో, అధికారులు ఆయన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ అక్రమాస్తుల కేసులో మరింత లోతైన దర్యాప్తు చేపట్టేందుకు, నిందితుడిని తమ కస్టడీకి తీసుకోవాలని ఏసీబీ ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఒక సామాన్య ఉద్యోగి నుండి కోటీశ్వరుడిగా ఎదిగిన నరహరి తీరు, ప్రభుత్వ విభాగాల్లో అవినీతి ఏ స్థాయిలో వేళ్లూనుకుందో స్పష్టం చేస్తోందని అంటున్నారు.