భువనేశ్వరి అనుమతి ఇస్తేనే...బాబు ఆసక్తికర వ్యాఖ్యలు !
ఢిల్లీకి రాజు అయినా ఒక అమ్మకు కొడుకే అని సామెత ఉంది. అలాగే ఎంతటి పాలకులు అయినా ఇంట్లో సతీమణుల మాటకే ఎక్కువ విలువ ఇస్తారు.
ఢిల్లీకి రాజు అయినా ఒక అమ్మకు కొడుకే అని సామెత ఉంది. అలాగే ఎంతటి పాలకులు అయినా ఇంట్లో సతీమణుల మాటకే ఎక్కువ విలువ ఇస్తారు. వారు అన్నీ ఆలోచించి భర్తలకు సలహా సూచనలు ఇస్తారు. ఇక ఈ రోజున నారా భువనేశ్వరి పుట్టిన రోజు. ఆమె గురించి అందరికీ తెలిసిందే. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరాముడి ముద్దుల తనయ. ఆయన మూడవ కుమార్తె. అంతే కాదు జాతీయ స్థాయిలో దిగ్గజ నేత అయిన నారా చంద్రబాబు సతీమణి. ఆమె పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు చేసిన ట్వీట్ సతీమణి పట్ల ఆయనకు ఉన్న అనురాగం ఆమె నిబద్ధత అంకితభావం పట్ల ఆయన చూపించే గౌరవం అభిమానం అన్నీ అర్ధం అవుతాయి.
మా ఆవిడను అడగాలి :
ఇదిలా ఉంటే అన్నదాత సుఖీభవ కార్యక్రమం సందర్భంగా పల్నాడు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు లింగంగుంట్లలో ప్రకృతి వ్యవసాయం చేస్తోన్న రైతు గుడిపల్లి నాగభూషణంకు చెందిన పొలాన్ని సందర్శించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా తనకు కలిగిన లబ్ధిని, ప్రయోజనాలను నాగభూషణం ముఖ్యమంత్రికి వివరించారు. నాగభూషణం లాంటి రైతులే ప్రకృతి వ్యవసాయానికి ఆదర్శంగా నిలుస్తారని చంద్రబాబు ఈ సందర్భంగా కొనియాడారు. ఇదే సమయంలో నాగభూషణానికి చెందిన గానుగను కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు. వేరుశనగ, నువ్వులు కొబ్బరి తదితర నూనెగింజలను సహజ పద్ధతిలో గానుగ ద్వారా నూనె ఉత్పత్తి చేస్తున్నట్టు నాగభూషణం బాబుకు వివరించారు. గానుగ ఏర్పాటు అదనపు ఆదాయ వనరుగా మారిందని ఇటువంటి సంప్రదాయ ఆధారిత పరిశ్రమలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దీంతో సదరు రైతు తాము ఉత్పత్తి చేస్తున్న కోల్డ్‌ప్రెస్డ్ వేరుశెనగ నూనెను అనేక మందికి సరఫరా చేస్తున్నామని మీరు కూడా వినియోగించాలని ముఖ్యమంత్రిని నాగభూషణం చొరవ తీసుకునే ఒక కోరిక కోరేశారు. దానికి చంద్రబాబు చెప్పిన జవాబు అయితే ఆసక్తికరంగా సాగింది. మా ఇంట్లో ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలంటే తన సతీమణి భువనేశ్వరిని అడగాలంటూ బాబు చెప్పడం విశేషం.
ఫోన్ చేసి మరీ :
ఇదిలా ఉంటే రైతు కోరికను మన్నించిన చంద్రబాబు వెంటనే ఆ పొలం నుంచే తన సతీమణి భువనేశ్వరికి ఫోన్ చేశారు. ఆమెకి విషయం చెప్పారు. దాంతో భునవేశ్వరి సరేననడంతో ఒక లీటరు వేరుశనగ నూనెను అక్కడికక్కడే రైతు నుంచి బాబు కొనుగోలు చేసి శభాష్ అనిపించారు. దీంతో అక్కడ ఉన్న వారు అంతా బాబు తన సతీమణికి ఇచ్చిన విలువను గౌరవాన్ని చూసి బాబు ఈజ్ గ్రేట్ అనేశారు. నాలుగున్నర దశాబ్దాలకు మించిన కాపురం ఎంతో ఆదర్శంగా చక్కగా బాబు భువనేశ్వరిలది సాగుతోంది. వారిద్దరి మధ్య ఉన్న అవగాహన పరస్పరం ఇచ్చి పుచ్చుకునే గౌరవం మర్యాదలు ఇవన్నీ ఈ తరానికి ఆదర్శమని అంతా అంటున్నారు.
ప్రకృతి వ్యవసాయమే :
ఇదిలా ఉంటే ప్రకృతి వ్యవసాయానికి పెద్ద పీట వేస్తామని కూడా చంద్రబాబు ప్రకటించారు. ఏపీలో ప్రకృతి వ్యవసాయం మేలైన విధానం అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కేంద్రం సైతం ప్రకృతి వ్యవసాయం చేయాలని కోరుతోంది. అలా చేసినట్లు అయితేనే ఇతర దేశాల నుంచి ఎరువులను ఎగుమతి చేసుకోవాల్సిన ఇబ్బందులు కూడా తప్పుతాయని అంటున్నారు.