కేసీఆర్ ను కాలిఫోర్నియా గవర్నర్ గుర్తించారండోయ్

Update: 2016-04-22 04:45 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోలిస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విదేశీ పర్యటనలు పెద్దగా చేయరు. ఆయనకు ఆ ఆసక్తి పెద్దగా ఉన్నట్లు కూడా అనిపించదు. తెలంగాణ జిల్లాల్లో తరచూ పర్యటించే ఆయన ఢిల్లీ పర్యటనలు.. విదేశీ టూర్లకు కాస్త దూరమేనని చెప్పాలి. అంతేకాదు.. అంతర్జాతీయంగా తనదైన ముద్ర వేయాలన్న ఆసక్తి ప్రదర్శించరు. తన పనేదో తాను చేసుకుంటూ పోవటమే తప్పించి.. జాతీయ.. అంతర్జాతీయ ప్రచారాన్ని పట్టించుకోరు. తన మానాన తాను అన్నట్లుగా ఉన్నా ఆయన్ను ప్రత్యేకంగా గుర్తిస్తూ వచ్చే ఆహ్వానాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. ఆ మధ్య సింగపూర్ లో నిర్వహించిన సదస్సుకు కేసీఆర్ ను రావాలని కోరటం మర్చిపోకూడదు.

తాజాగా అలాంటి ఆహ్వానమే ఒకటి వచ్చింది. కాలిఫోర్నియా గవర్నర్ ఎడ్మండ్ జి. బ్రౌన్ కేసీఆర్ కు ప్రత్యేక ఆహ్వానం ఒకటి పంపారు. వచ్చే జూన్ లో జరిగే సబ్ కాంటినెంటల్ క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ మీటింగ్ కు హాజరు కావాల్సిందిగా ఇన్విటేషన్ పంపారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సోలార్ ఎనర్జీ ప్రణాళికను ప్రత్యేకంగా ప్రశంసించటమే కాదు.. కాలిఫోర్నియా..తెలంగాణ రాష్ట్రాలు ఒకే విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నాయని పేర్కొనటం గమనార్హం. తాజా ఆహ్వానం కేసీఆర్ పని తీరుకు లభించిన గుర్తింపుగా టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకోవటం కనిపిస్తోంది. అవకాశం వచ్చినప్పుడు ఆ మాత్రం ప్రచారం చేసుకోరా ఏంటి..?
Tags:    

Similar News