రియల్ కష్టాలు దేశంలో చాలా ఎక్కువంట

Update: 2015-10-13 07:53 GMT
ఇప్పటివరకూ చాలానే రంగాలకు చెందిన వారు నిరసనలు చేయటం చేశాం. కానీ.. ఎప్పుడూ పెద్దగా బయటకు రాని రంగం ఒకటి తాజాగా బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేయటం గమనార్హం. దేశంలో వ్యవసాయం తర్వాత అతి పెద్దదైన నిర్మాణ రంగానికి చెందిన రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన క్రెడాయ్ తాజాగా దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేసింది.

నిర్మాణాలకు ఇవ్వాల్సిన అనుమతులు ఆలస్యంగా ఇవ్వటం.. అధికారుల వేధింపులు.. రాజకీయ జోక్యం లాంటి సమస్యల కారణంగా నిర్మాణ రంగం తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటుందని వారు వాపోతున్నారు. అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రెండు నుంచి మూడేళ్ల పాటు తిరగాల్సి వస్తోందని.. ప్రాజెక్టులు చేపట్టే ప్రాంతాల్లో ఆయా స్థానిక రాజకీయ నేతల జోక్యం పెరుగుతుందన్న ఆందోళనను క్రెడాయ్ వ్యక్తం చేస్తోంది.

ఇటీవల మహారాష్ట్రలోని థానేకి చెందిన ఒక బిల్డర్ ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో.. రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని తెరపైకి తీసుకొస్తూ.. మంగళవారం దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధిని ఇచ్చే స్థిరాస్తి రంగంలో ఉన్న సమస్యల్ని కేంద్ర సర్కారు దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశ్యంతో తామీ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు క్రెడాయ్ ప్రతినిధులు చెబుతున్నారు. తాజా నిరసనలో భాగంగా దేశ వ్యాప్తంగా ఈ రోజు రియల్ ఎస్టేట్.. డెవలపర్లు తమ నిర్మాణ పనుల్ని నిలిపివేశారు.
Tags:    

Similar News