'మ‌హేశ్వ‌రం' మంట‌లు చ‌ల్లారలేదు బ్రో!

Update: 2023-01-22 04:03 GMT
తెలంగాణ రాష్ట్రంలో శాసనసభకు ఎన్నికలు సమీపించేకొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. భారత్‌ రాష్ట్ర సమితిలో టికెట్‌ దక్కే అవకాశం లేనివారు పార్టీ మారే యోచనలో ఉన్నారు. వీరిలో ఎవరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు? వీరి పయనం ఏ వైపు ఉంటుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. ఉమ్మ‌డి రంగా రెడ్డి జిల్లాలోని కీల‌క‌మైన మహేశ్వరం నియోజ‌క‌వ‌ర్గంలో ఈ సెగ మ‌రింత ఎక్కువ‌గా ఉంది.

ఇక్క‌డ నుంచి గ‌త 2018 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచిన సబితా ఇంద్రారెడ్డి.. మూణ్ణాళ్ల‌కే అధికార పార్టీలో చేరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ త‌న‌కే టికెట్ ఇస్తార‌ని ఆమె గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. అయితే.. గత ఎన్నికల్లో ఈమె చేతిలో ఓడిపోయిన టీఆర్ ఎస్ అభ్య‌ర్థి, మాజీ మేయ‌ర్ తీగల కృష్ణారెడ్డి త‌న‌కే టికెట్ అని ప్ర‌చారం చేసుకుంటున్నారు.

దీంతో మ‌హేశ్వ‌రంలో రాజ‌కీయ కాక భారీగా పెరిగింది. దీనిపై పార్టీ అధినేత కేసీఆర్ కానీ, కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ కానీ స్పందించ‌డం లేదు. అయితే.. అటు స‌బితా రెడ్డి మాత్రం త‌న అనుచ‌ర వ‌ర్గంతో త‌ర‌చుగా భేటీ అవుతున్నారు. త‌న‌కే టికెట్ ఇస్తార‌ని.. అధైర్య ప‌డొద్ద‌ని ఆమె చెబుతున్నారు. మ‌రోవైపు తీగ‌ల అయితే.. సీటు త‌న‌దేన‌ని.. త‌న‌కు ఎవ‌రూ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని..అంటున్నారు.

అంతేకాదు.. నేరుగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లి బీ ఫారం తెచ్చుకునే స‌త్తా త‌న‌కు ఉంద‌ని చెబుతున్నారు. ఈ వ్యాఖ్య‌ల‌తో ఇరు వ‌ర్గాల మ‌ధ్య పోరు తార‌స్థాయికి చేరింది. మ‌రోవైపు.. కాంగ్రెస్ తీగ‌ల కృష్ణారెడ్డి కోసం వేచి చూస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.  ఆయ‌న వ‌స్తే.. పార్టీలో చేర్చుకునేందుకు రెడ్ కార్పెట్‌ప‌రిచింద‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో టీఆర్ ఎస్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌నేది ఆస‌క్తిగా మారింది.
Tags:    

Similar News