సెంట్రల్ ఫలితంపై కోర్టుకు వెళ్లిన బోండా ఉమ!

Update: 2019-06-15 07:28 GMT
విజయవాడ సెంట్రల్.. ఇటీవలి ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో అత్యల్ప మెజారిటీ నమోదు అయిన నియోజకవర్గం. ఈ శాసనసభ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాది విష్ణు కేవలం ఇరవై ఐదు ఓట్ల మెజారిటీతో నెగ్గారు. తెలుగుదేశం పార్టీ నుంచి బోండా ఉమామహేశ్వరరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన సంగతి తెలిసిందే.

వీరిద్దరి మధ్యన గట్టి పోటీ నెలకొంది. బోండా ఉమ తరఫున వంగవీటి రాధా కూడా గట్టిగా ప్రచారం చేశాడు. ఈ  పరిణామాల్లో తెలుగుదేశం పార్టీ గట్టి పోటీనే ఇచ్చినట్టుంది. అయితే అంతిమంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మల్లాది విష్ణు పాతిక ఓట్ల మెజారిటీతో నెగ్గినట్టుగా డిక్లరేషన్ వచ్చింది.

అయితే ఓట్ల లెక్కింపు  వ్యవహారంలో తమకు పలు అనుమానాలున్నాయని  బోండా ఉమ మొదటి రోజే వాదన మొదలుపెట్టారు. ఈ విషయంలో చంద్రబాబుకు విన్నవించుకున్నారట ఆయన. ఆ వ్యవహారం పై కోర్టుకు వెళ్లాలని చంద్రబాబు సూచించారట. దీంతో ప్రస్తుతం అందుకు సంబంధించి కోర్టులో బోండా ఉమ తరఫున పిటిషన్ దాఖలు అయ్యింది.

ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది కోర్టు. పదకొండు వీవీ ప్యాట్లను లెక్కించకుండానే ఫలితాన్ని ప్రకటించారని, ఇంకా కౌంటింగ్ విషయంలో మరిన్ని అనుమానాలున్నాయని బోండా అంటున్నారట. మరి ఈ విషయంలో కోర్టు ఎలా స్పందిస్తుందో, ఈసీ కి ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందో!

    

Tags:    

Similar News