హ్యాకర్లనూ హడలెత్తించే నయా బాడీగార్డ్స్.. చైనాలో ఫుల్ డిమాండ్

Update: 2020-09-22 04:45 GMT
చైనాలోని ఉన్నోళ్లందరికీ ఉన్నట్టుండి సరికొత్త అవసరం పుట్టుకొచ్చింది. ఆ దేశంలో  ధనవంతులు ఎక్కువ. అప్పటిలా వీరికి దొంగల భయం లేదు. ఉన్నదల్లా సైబర్ నేరగాళ్ల భయమే. దొంగలు ఎటోచ్చినా ఎదుర్కోవడం సులభమే. కానీ ఏ వైపు నుంచి వస్తారో తెలియని సైబర్ నేరగాళ్లకు అందరూ భయ పడుతున్నారు. అందుకే సైబర్ నేరగాళ్లు ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా డిజిటల్ డార్క్ ఆర్ట్స్ బాడీగార్డ్స్ ఇప్పుడు అందుబాటు లోకి వచ్చారు. వీళ్లకిప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఉన్నోళ్లు అంతా డిజిటల్ డార్క్ ఆర్ట్స్‌లో నైపుణ్యం కలిగిన బాడీ గార్డ్స్ ని పెట్టుకోవాలని భావిస్తుండటం తో కావాల్సినంత మంది దొరకడం లేదు. ఈ విషయం లో ధనవంతులు ఇబ్బందులు పడుతున్నారు.

తియాంజిన్‌లో ఉన్న ‘గెంఘిస్ సెక్యూరిటీ అకాడమీ’లో ఇప్పుడు సాధారణ బాడీగార్డ్స్‌కు ఇచ్చే శిక్షణతో పాటు డిజిటల్ డార్క్ ఆర్ట్స్‌లోనూ శిక్షణ ఇస్తున్నారు. ఇలాంటి శిక్షణ ఇచ్చే సంస్థ చైనాలో ఉండేది ఇదొక్కటే. గెంఘిస్ సెక్యూరిటీ అకాడమీలో శిక్షణ అంటే అల్లా టప్పా శిక్షణ కాదు.మిలటరీ శిక్షణ కంటే కఠినంగా ఉంటుంది. ఇక్కడ సాధారణ బాడీగార్డ్స్ లా  రక్షణ నైపుణ్యాలతోపాటు ఆయుధాలు, హైస్పీడ్ డ్రైవింగ్‌ లోనూ శిక్షణ ఇస్తారు. ఏటా ఈ అకాడమీ వేయి మంది డిజిటల్ డార్క్ ఆర్ట్స్ బాడీగార్డ్స్ ను సిద్ధం చేస్తుంది. డిజిటల్ బాడీ గార్డ్స్ కి సంపన్నుల వద్ద విపరీతమైన డిమాండ్  ఏర్పడింది. ఒక్కో బాడీ గార్డ్  3 వేల డాలర్లను వసూలు చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

క్రెడిట్ సూయిస్ లెక్కల ప్రకారం చైనాలో  4.4 మిలియన్ల మంది మిలియనీర్లు ఉన్నారు.  వీరందరూ ఇప్పుడు డిజిటల్ బాడీ గార్డ్స్ నే నియమించుకుంటుండడంతో వారి డిమాండ్ తగ్గ విధంగా బాడీ గార్డ్స్ ని ఇవ్వలేకున్నామని  అకాడమీ వ్యవస్థాపకుడు చెన్ యాంగ్‌ కింగ్ తెలిపారు. గతంలో మిలటరీ లో పని చేసి వచ్చిన వారికి డిజిటల్ డార్క్ ఆర్ట్స్ లో ఎక్కువ గా శిక్షణ ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మంచి బాడీ తో పాటు,  భౌతిక దాడులను  ఎదుర్కోవడం, సైబర్ ముప్పును సమర్థంగా ఎదుర్కోవడం, మొబైల్ ఫోన్, నెట్‌వర్క్ సెక్యూరిటీ హ్యాక్‌ల ను తిప్పి కొట్టడం, రహస్యం గా తమ కార్యకలాపాల్ని గమనించే వారిని గుర్తించడం వంటివి  అకాడమీ లో శిక్షణ ఇస్తున్నట్లు  చెన్ వివరించారు.  

చైనాలో నేరాల రేటు తక్కువ. అయితే, ప్రొఫెషనల్ హ్యాకర్లు చెలరేగి  పోతుండడంతో వారిని ఢీ కొట్టేందుకు డిజిటల్ డార్క్ ఆర్ట్స్ బాడీగార్డ్స్ సిద్ధం అయ్యారు. మంచి వేతనాలు కూడా ఉంటుండడంతో ఇందులో శిక్షణ పొందేందుకు యువత ముందుకు వస్తున్నారు.
Tags:    

Similar News