పాకిస్తాన్ లో పడవ బోల్తా..ఒకే కుటుంబానికి చెందిన పది మంది దుర్మరణం

Update: 2020-08-18 07:10 GMT
పాకిస్తాన్ లో  పెను విషాదం జరిగింది.విహార యాత్ర కోసం వెళ్లిన ఓ కుటుంబం పడవ బోల్తా పడడంతో  10 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఆరుగురు మహిళలు,  ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ సంఘటన పాకిస్థాన్లోని దక్షిణ సింధ్ రాష్ట్రంలో జరిగింది. పాకిస్తాన్ లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. కొన్ని నెలలుగా లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇటీవల కొన్ని మినహాయింపులతో కూడిన సడలింపులు  ఇచ్చారు. కొద్దిరోజులుగా ఇంటిపట్టునే ఉంటున్న ఓ  కుటుంబం ఎక్కడికైనా పర్యటక  ప్రాంతానికి వెళ్లి సేదతీరాలని నిర్ణయించుకుంది.

తట్టాలోని కీన్ ఝార్ సరస్సు వద్ద ఉన్న రిసార్టుకు  వారు చేరుకున్నారు. అక్కడి పర్యాటక ప్రాంతాలన్నింటినీ చూసి సరదాగా గడిపారు. ఆ తర్వాత అక్కడే ఓ పడవ అద్దెకు తీసుకుని సరస్సులో  విహారానికి బయలుదేరారు. పడవ కొంత దూరం ప్రయాణించిన తర్వాత బలమైన గాలులు వీచడం మొదలైంది. గాలుల ధాటికి పడవ బోల్తా పడిపోయింది. వెంటనే స్థానికంగా ఉండే గజ ఈతగాళ్లు అక్కడికి చేరుకుని ముగ్గురిని రక్షించారు. అప్పటికే  నీట మునిగి పది మంది మృతి చెందటంతో వారి మృత దేహాలను ఒడ్డుకు చేర్చారు. బలమైన గాలులే పడవ ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని వారి బంధువులకు అప్పగించారు. విహారం కోసం వెళ్లి పది మంది ప్రాణాలు కోల్పోవడంతో ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Tags:    

Similar News