జగన్ పై మత విద్వేషం.. అభాసుపాలైన బీజేపీ!

Update: 2019-08-21 11:20 GMT
భారతీయ జనతా పార్టీ ఎక్కడ బలోపేతం కావాలన్నా అక్కడ మతచిచ్చును రేపాల్సిందే అని పరిశీలకులు అంటున్నారు. బీజేపీ పుట్టుక - ఎదుగుదల - అధికారం సంపాదించుకోవడం.. వంటి ప్రతి అంశంలోనూ మతపరమైన కారణాలను పరిశీలకులు పట్టిచూపుతూ ఉంటారు. ఇక అధికారం చేతిలో ఉన్నా దేశంలోని మధ్యతరగతి - పేద ప్రజల జీవితాలను భారతీయ జనతా పార్టీ మార్చింది ఏమీ లేదు.

మోడీ చేసే ప్రయోగాలు కొన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. మరి కొన్ని ఫలితాలు ఎలా ఉంటాయో ముందు ముందు తెలిసే అవకాశం ఉంది. ఇక తాము అధికారంలో లేనన్ని రోజులూ బీజేపీ వాళ్లు పెరుగుతున్న ధరలు - ఇతర వ్యవహారాలను తరచూ ప్రస్తావించే వారు. అయితే అధికారం అందుకున్నా నిత్యవసరాల ధరలు - పెట్రో ధరల పెరుగుదల అంశం గురించి వారు మాట్లాడటం లేదు.

ఇక తమకు బలం లేని రాష్ట్రాల్లో కూడా తెచ్చిపెట్టుకున్ననేతలతో బీజేపీ దర్పం ఒలకపోస్తూ ఉన్న వైనాన్ని అంతా గమనిస్తూనే ఉన్నారు. ఆ సంగతలా ఉంటే ఏపీలో అలా తెచ్చిపెట్టుకున్న నేతలు మత చిచ్చును రేపడానికి ప్రయత్నాలు సాగిస్తూ ఉండటం గమనార్హం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హిందూ మత విశ్వాసాలపై గౌరవం లేదంటూ సూటిగా చిచ్చుపెట్టే ప్రయత్నాన్ని మొదలుపెట్టారు కమలనాథులు.

అయితే ఈ మొదటి ప్రయత్నమే అభాసుపాలైన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. యూఎస్ పర్యటనలో భాగంగా జగన్ కు జ్యోతిప్రజ్వలనకు ముందుకు రాలేదని భారతీయ జనతా పార్టీ ప్రచారం ప్రారంభించింది. అయితే ఇప్పటి వరకూ జగన్ హిందూ మతవిశ్వాసాలకు పూర్తిగా విలువను ఇస్తున్నాడు. ఆయన మతం ఆయన వ్యక్తిగతం. ఇక గెలిచాకా కూడా తిరుమల శ్రీనివాసుడి దర్శనం చేసుకున్నాడు. గండి ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లాడు. అలా తను వ్యక్తిగతంగా చొరవ చూపనిదే జగన్ మోహన్ రెడ్డి గెలిచాకా కూడా హిందూ దేవాలయాల సందర్శనకు వెళ్లే అవకాశాలు ఉండేవి కావు.

అయితే అసలు అమెరికాలో జగన్ కు జ్యోతిప్రజ్వాలన స్వాగతమే లేదని నిర్వాహకులు తేల్చి చెప్పారు. జగన్ కు పూర్ణకుంభ స్వాగతం చెప్పినట్టుగా వారు వివరించారు. జగన్ సావదానంగా వచ్చారని, వినమ్రతతో వ్యవహరించారని, ఆడిటోరియంలలో జ్యోతిప్రజ్వలనలకు అమెరికాలో అనుమతి ఉండదు. అందుకే వాళ్లు ఏవో లైట్లను తెచ్చారట. వాటిని చూసి జగన్ నవ్వుకున్నట్టుగా తెలుస్తోంది.

జ్యోతి ప్రజల్వన హిందూ సంప్రదాయం కానీ, లైట్లు  - బల్బులు మన వి కావు. అలాంటి వాటిని కూడా జగన్ కాదని ఏమీ అనలేదు. జగన్ పక్కకు వెళ్లిపోతున్న స్క్రీన్ షాట్ తో భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తూ ఉంది. ఇన్ని రోజులూ జగన్ చేసినవి నమ్మకూడదని - తమ కల్పితాలను మాత్రమే నమ్మాలని బీజేపీ ప్రచారం చేసుకుంటూ ఉంది. భారతీయ జనతా పార్టీ మరీ ఇంతలా మతం అంశాన్ని వాడుకోవడాన్ని చూసి చాలా మంది ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏమీ లేని చోట చిచ్చు పెట్టాలని చూస్తున్న వైనం పట్ల విశ్లేషకులు విమర్శలు మొదలుపెట్టారు.

Tags:    

Similar News