వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన బీజేపీ ఎంఎల్ఏ

Update: 2021-01-01 15:30 GMT
కేంద్రం ఈమధ్యనే రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాలపై దేశంలో ఎంతటి రాద్దాంతం జరుగుతోందో అందరికీ తెలిసిందే. పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, రాజస్ధాన్ రాష్ట్రాల్లోని రైతులు, రైతు సంఘాల ఆధ్వర్యంలో గడచిన 39 రోజులుగా ఉద్యమం జరుగుతోంది. ఢిల్లీ-హర్యానా శివారుప్రాంతమైన సింఘూ దగ్గర వేలాదిమంది రైతులు క్యాంపులు వేసి మరీ ఉద్యమాన్ని నడుపుతున్నారు. ఇటువంటి నేపధ్యంలోనే కేరళ అసెంబ్లీ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తు తీర్మానం చేసింది.

కేరళ ప్రభుత్వం కేంద్రం చట్టాలను వ్యతిరేకించటంలో ఏమీ ఆశ్చర్యంలేదు. ఎందుకంటే కేరళలో ఉన్నది లెఫ్ట్ ఫ్రంటు ప్రభుత్వం కాబట్టి వ్యతిరేకించిందని అనుకోవవచ్చు. కానీ అసెంబ్లీలో బీజేపీకి ఉన్న ఏకైక ఎంఎల్ఏ ఓ రాజగోపాల్ కూడా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించటమే ఆశ్చర్యంగా ఉంది. నూతన చట్టాలపై అసెంబ్లీ చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ లో లెఫ్ట్ ఫ్రంట్ ఎంఎల్ఏలతో పాటు యూడీఎఫ్ ఎంఎల్ఏలు కూడా వ్యతిరేకంగానే ఓట్లేశారు.

అయితే చివరలో ఓటు వేసిన ఓ రాజగోపాల్ కూడా మూడు చట్టాలకు వ్యతిరేకంగానే ఓటు వేయటంతో అందరు ఆశ్చర్యపోయారు. తర్వాత ఎంఎల్ఏ మాట్లాడుతూ రైతులకు వ్యతిరేకంగా తయారైన చట్టాలను వ్యతిరేకించాలని తాను అనుకున్నట్లు ప్రకటించారు. కేంద్రం తయారుచేసిన వ్యవసాయ చట్టాలను రైతులే వద్దంటున్నపుడు కేంద్రం ఎందుకు అంత పట్టుదలగా ఉందో తనకు అర్ధం కావటం లేదన్నారు. పార్టీలు వేరైనా రైంతాంగం సమస్యలపై అందరు కలిసికట్టుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తాను అనుకున్నట్లు చెప్పారు.

మొత్తానికి వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో కేంద్ర వ్యవసాయ చట్టాలకు మెల్లిగా అయినా వ్యతిరేకత పెరుగుతోంది. ఈమధ్యనే జరిగిన దేశవ్యాప్త ఆందోళనకు, బంద్ కూడా విజయవంతం అయిన విషయం తెలిసిందే. పంజాబ్ ప్రభుత్వమైతే బాహాటంగానే చట్టాలను వ్యతిరేకిస్తోంది. అలాగే మహారాష్ట్ర, హర్యానా, తెలంగాణా ప్రభుత్వాలు కూడా అసెంబ్లీలో వ్యతిరేక తీర్మానాలు చేశాయి. పార్లమెంటులో వ్యవసాయ చట్టాల బిల్లులకు మద్దతిచ్చిన వైసీపీ కూడా దేశబంద్ కు సహకరించింది. ఇపుడు ఏకంగా బీజేపీ ఎంఎల్ఏనే చట్టాలను వ్యతిరేకించటం సంచలనంగా మారింది.
Tags:    

Similar News